ఇక్కడే భీముడి అహంకారాన్ని హనుమంతుడు అణచివేశాడట.. మంగళ, శనివారాల్లోనే ప్రవేశం..

ఇవాళ హనుమంతుని జయంతి. ఈ సందర్భంగా పండుపోల్ హనుమంతుని ఆలయ ప్రత్యేకత గురించి చెప్పుకుని తీరాల్సిందే. ఆ ఆలయం.. రాజస్థాన్ లోని అల్వార్ సమీపంలోని సరిస్కా టైగర్ రిజర్వ్‌లో ఉంది. సరిస్కా ప్రధాన ప్రాంతంలో ఉన్న కారణంగా దీనికి ఎప్పుడు పడితే అప్పుడు వాహనాల ద్వారా వెళ్లలేం. కేవలం మంగళ, శనివారాల్లో మాత్రమే ఆలయానికి ప్రవేశం ఉంటుంది. ఈ ఆలయంలో ఆంజనేయస్వామి నిద్రిస్తున్న విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఇలాంటి విగ్రహాన్ని చూడటం చాలా అరుదు. అయితే ఈ విగ్రహం ఉన్న ప్రదేశంలో భీముని అహంకారాన్ని హనుమంతుడు ఛేదించాడనేది ప్రజల నమ్మకం.

భీముడు తనకంటే బలవంతుడు లేడని విర్రవీగుతూ ఉంటాడు. ఆయన అహంకారాన్ని అణిచేందుకు హనుమంతుడు వృద్ధ వానరుడి రూపంలో పడుకుని ఉంటాడు. భీముడిని రెచ్చగొడుతూ హనుమంతుడు తన తోకను ఎత్తాలంటాడు. భీముడు ఎంత ప్రయత్నించినా సాధ్యపడదు. తరువాత భీముడికి నిజరూపంలో కనిపించాడు. అప్పుడు తన తప్పు తెలుసుకున్న భీముడు ఆంజనేయుడికి నమస్కరిస్తాడు. హనుమంతుడు వృద్ధ వానరుడి రూపంలో పడుకున్న ప్రదేశంలో విగ్రహాన్ని ఏర్పాటు చేసినట్లు చెపుతుంటారు. ఈ ఆలయాన్ని పాండవులు నిర్మించారని అంటారు. ఇది ప్రస్తుతం పండుపోల్ హనుమాన్ దేవాలయంగా ప్రసిద్ధి చెందింది.

Share this post with your friends