శివాలయానికి ఒక వైపు పారే నది.. మరోవైపు శ్మశానం.. ఇలా ఎక్కడుంటుందంటే.. కాశీలోనే ఉంటుందనే సమాధానం వినవస్తుంది. అయితే తెలంగాణలోని ఖమ్మం జిల్లా మధిరలోనూ కాశీ క్షేత్రానికి దగ్గరగా ఉండే ఆలయం ఉంది. ఇది మృత్యుంజయస్వామివారి ఆలయం అంటే శివాలయమే. ఈ ఆలయానికి ఒకవైపు వైరా నది ఉంటుంది. మరోవైపు శ్మశానం ఉంటుంది. ఈ ఆలయం వాస్తు కూడా కాశి మాదిరిగానే ఉంటుందని అంతా చెబుతారు. అందుకే దీనిని చిన కాశి అని కూడా పిలుస్తారు. ఇక్కడ మహా శివరాత్రి ఉత్సవాలు ఐదు రోజుల పాటు జరుగుతాయి.
ఐదు రోజుల పాటు కూడా ఇసుకేస్తే రాలనంత మంది జనం ఈ శివరాత్రి ఉత్సవాలకు హాజరవుతారు. ఒకవైపు ఎడ్ల పందేలు.. మరోవైపు పొటేళ్ల పందేలతో ఐదు రోజులూ సందడిగా ఉంటుంది. ఈ శివాలయానికి ఒక చారిత్రక నేపథ్యం ఉంది. అదేంటంటే.. కాకతీయ రాజు ఈ ప్రాంతాన్ని పాలించే రోజుల్లో రాజు, సైనిక దళం ఓ సారి మధిర మండలంలోని మడుపల్లికి బయలుదేరారట. వారి గుర్రాలు మధిర వద్ద అకస్మాత్తుగా నిలిచిపోయాయట. ఎందుకు ఇలా జరిగిందని అనుమానం వచ్చిన రాజు గుర్రాలు ఆగిన స్థలంలో పరీక్షించగా శివలింగం కనిపించిందట. అక్కడ ఆలయం నిర్మించారు. ఆ ఆలయాన్ని ఇటీవలి కాలంలో చాలా పెద్దగా నిర్మించారు. ఇలా ఒకవైపు పారే నది.. మరోవైపు శ్మశానం ఉన్న శివాలయాలు చాలా అరుదుగా ఉంటాయి.