దసరా పండుగను చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా జరుపుకుంటారు. విజయదశమి రోజున రావణుడి దిష్టిబొమ్మను దహనం చేస్తూ ఉంటారు. ఊరందరిదీ ఒక దారైతే ఉలిపి కట్టెది మరో దారి అన్నట్టుగా మన దేశంలోనే కొన్ని ప్రాంతాల్లో రావణుడిని పూజిస్తారు. దేశం మొత్తానికి విలన్ అయిన రావణుడికి ఇక్కడ నిత్యపూజలు నిర్వహిస్తారు. మరి రావణుడిని పూజించే ఆ ప్రాంతాలు ఏవో తెలుసుకుందాం.
హిమాచల్ ప్రదేశ్‌లోని కాంగ్రా: ఈ ప్రదేశంలో శివుడిని శాంతింపజేయడానికి రావణుడు భక్తితో తపస్సు చేసి శివయ్య అనుగ్రహం పొందాడని ఇక్కడి వారి నమ్మకం. కాబట్టి ఇక్కడ రావణుడి దిష్టిబొమ్మను దహనం చేయరు.
రాజస్థాన్‌లోని జోధ్‌పూర్: ఇక్కడి ఓ ఆలయంలో రావణుడిని దేవతగా పూజిస్తారు. దీనికి కారణమేంటంటే.. రావణుడు.. మండవర్ రాజు కుమార్తె మండోదరిని వివాహం చేసుకున్నాడు. అప్పట్ల మండవర్ రాజు జోథ్‌పూర్ ప్రాంతాన్ని పాలించేవాడట. కాబట్టి తమ ప్రాంత అల్లుడైన రావణుడి మరణానికి సంతాపాన్ని ఆ రాజు వారసులు వ్యక్తం చేస్తూ ఆ ప్రాంతంలో రావణుడి దిష్టిబొమ్మను దహనం చేయరు.
మధ్యప్రదేశ్‌లోని మందసౌర్: హిందూ గ్రంథాల ప్రకారం రావణుడి భార్య మండోదరి మధ్యప్రదేశ్‌లోని మందసౌర్‌లో జన్మించిందట. కాబట్టి ఇక్కడి వారంతా రావణుడిని అల్లుడిగా భావించి దసరా పర్వదినాన స్థానికులంతా రావణుని ఇంట్లో దీపాలు ఆర్పి గౌరవిస్తారు.
ఉత్తరప్రదేశ్‌లోని బిస్రఖ్: హిందువుల ప్రకారం ఇది రావణుడు జన్మించిన ప్రదేశం. కాబట్టి ఇక్కడ రావణుడిని పూజిస్తారు. అలాగే నవరాత్రులలో 10వ రోజు స్థానికులు రావణుడికి పూజలు చేస్తూ యజ్ఞం చేస్తారు.
కర్ణాటకలోని కోలార్: రావణుడు శివ భక్తుడు కాబట్టి కోలార్ జిల్లాలోని ఈ ఆలయంలో రావణుడికి విశేషంగా గౌరవించుకుంటూ ఉంటారు. ఈ ఆలయంలో రావణుడిని పూజించడమే కాకుండా దసరా పండుగ సందర్భంగా స్థానికులు ఊరేగింపు నిర్వహిస్తారు. దసరా సమయంలో స్థానికులు శివుడితో పాటు రావణుడికి ప్రత్యేక పూజల నిర్వహిస్తారు.