కొమురవెల్లి మల్లన్న కల్యాణం నేడు (ఆదివారం) అంగరంగ వైభవంగా జరిగింది. ఆలయ సమీపంలోని తోట బావి వద్ద ఇవాళ ఉదయం వారణాసిలోని కాశీ పీఠాధిపతి మల్లికార్జున విశ్వారాధ్యా శివాచార్య భగవత్పాదుల ఆధ్వర్యంలో వీరశైవ ఆగమ శాస్త్రం ప్రకారం కన్నుల పండువగా జరిగింది. వరుడు మల్లన్న తరుఫున కన్యాగ్రహీతలుగా పడిగన్నగారి వంశస్తులు.. మేడమ్మ, కేతమ్మ అమ్మవార్ల తరుఫున కన్యాదాతలుగా మహాదేవుని వంశస్తులు స్వామివారి కల్యాణం జరిపించారు. దేవతామూర్తులను పట్టువస్త్రాలు, పూల మాలలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. స్వామివారి కల్యాణాన్ని తిలకించేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులూ తలెత్తకుండా ఆలయ అధికారులు ఏర్పాట్లు నిర్వహించారు.
శనివారం సాయంత్రం లింగ బలిజ సమాజం నుంచి పడిగన్న గారి వంశస్తులు, మహదేవుని వంశస్తుల వారి ఇళ్లలో ప్రత్యేక పూజలు నిర్వహించి బియ్యాన్ని సేకరించి ఇవాళ తెల్లవారుజామున దిష్టికుంభం (బలిహరణం) నిర్వహించారు. అనంతరం ఉదయం 10:45 గంటలకు స్వామివారి కల్యాణం నిర్వహించారు. మధ్యాహ్నం 12 గంటలకు ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించారు. రాత్రి 7గంటలకు రథోత్సవం నిర్వహిస్తారు. రేపు ఉదయం స్వామి వారికి ఏకాదశ రుద్రాభిషేకం, లక్ష బిల్వార్చన, మహా మంగళహారతి, మంత్రపుష్పం, తీర్థ ప్రసాద వితరణ వంటి కార్యక్రమాలు నిర్వహించనున్నారు.