సూత మహాముని శౌనకుడు మొదలైన మునులకు విఘ్నేశ్వరుడు పుట్టిన విధానం, ఆరోజు చంద్రుడిని ఎందుకు చూడకూడదు అనే విషయాలను వివరించాడు. ఒకప్పుడు గజ (ఏనుగు) రూపంలో ఉన్న గజాసురుడు అనే రాక్షస రాజు పరమ శివుడి గురించి తీవ్ర తపస్సు చేసి ఎప్పుడూ పరమేశ్వరుడు తన ఉదరంలో ఉండేలా వరం పొందాడు. దీంతో శివుడు గజాసురుడి కోరిక తీర్చేందుకు అతని పొట్ట లోపలికి ప్రవేశించి అక్కడే ఉండనారంభించాడు. కైలాసంలో వున్న పార్వతీదేవికి భర్త గురించి తెలియక అన్ని చోట్లా వెతుకుతూ కొంతకాలానికి శివుడు గజాసురుడి పొట్టలో వున్నాడని తెలుసుకుంటుంది. గజాసురుడి ఉదరంలో ఉన్న శివుడిని ఏ విధంగా బయటకు రప్పించాలో తెలియక ఎంతో బాధపడి, చివరికి విష్ణుమూర్తి వద్దకు వెళ్లి మొరపెట్టుకుంటుంది. తన భర్తను కాపాడమని వేడుకుంది. దీంతో పార్వతీదేవిని విష్ణుమూర్తి ఓదార్చాడు.
ఆ తరువాత శ్రీహరి.. బ్రహ్మ మొదలైన దేవతలను పిలిచి సమాలోచనలు చేసి.. గజాసురుని చంపేందుకు గంగి రెద్దులను ఆడించేవాడిగా వెళ్ళటమే సరైనదని నిర్ణయించుకున్నాడు. శివుడి వాహనం నందిని ఒక గంగి రెద్దుగా చేసి, బ్రహ్మ మొదలైన దేవతల చేత తలొక వాయిద్యం ఇచ్చి.. తాను చిరు గంటలు, సన్నాయి తీసుకుని గజాసురుడు వుండే గజాసురపురానికి వెళ్ళాడు. అక్కడ గజాసురుడి ఎదురుగా గంగిరెద్దును ఆడించడంతో అతను ఆనందంలో మునిగిపోయాడు. “మీకు ఏం కావాలో కోరుకోండి. నేను ఇస్తాను” అని చెప్పాడు. అప్పుడు శ్రీహరి “ఇది శివుడి వాహనం నంది. శివుడిని వెదికేందుకే వచ్చింది కాబట్టి శివుడిని ఇవ్వు” అని కోరాడు. ఆ మాటలకు నిర్ఘాంతపడిన గజాసురుడు.. గంగి రెద్దులను ఆడించేందుకు వచ్చిన వాడు శ్రీహరి అని తెలుసుకుని, తనకు చావు తప్పదని అర్ధం చేసుకున్నాడు.
అపుడు తన పొట్టలోపల వున్న శివుడిని “నా శిరస్సు అందరికీ పూజ్యనీయంగా ఉండాలి. నా చర్మం నువ్వు ధరించాలి” అని కోరుకున్నాడు. తర్వాత తనను చంపేందుకు శ్రీహరికి అనుమతి ఇచ్చాడు. నంది తన కొమ్ములతో గజాసురుడిని పొట్ట చీల్చగా, లోపలనుంచి శివుడు బైటకు వచ్చాడు. ఆ తరువాత శ్రీహరి వైకుంఠానికి… శివుడు కైలాసానికి వెళ్ళిపోయాడు.
వినాయకుడి పుట్టుక..
కైలాసంలో వున్న పార్వతీదేవి శివుడు వస్తున్నాడన్న వార్త విని స్నానమాచరించేందుకు వెళ్లడానికి ముందుగా నలుగు పిండితో ఒక పిల్లవాడిని తయారు చేసింది. అతనికి ప్రాణం పోసి గుమ్మం ముందు కాపలాగా ఉంచి స్నానానికి వెళ్లింది. అప్పుడు శివుడు రాగా.. గుమ్మంలో వున్న పిల్లవాడు అడ్డు చెప్పాడు. కోపంతో శివుడు త్రిశూలంతో ఆ బాలుడి కంఠం తొలగించాడు. అది చూసిన పార్వతీదేవి తీవ్ర ఆవేదనకు గురైంది. అప్పుడు శివుడు తన భటులను ఉత్తర దిక్కుకి పంపించి గజాసురుడి శిరస్సును తెప్పించి ఆ బాలుడికి అతికించి ప్రాణం పోశాడు. అతనికి ‘గజాననుడు’ అనే పేరు పెట్టి, పెంచుకోవటం ప్రారంభించారు. గజాననుడు కూడా భక్తితో తల్లి తండ్రులకు సేవలు చేయసాగాడు. అనింద్యుడు అనే ఎలుకను వాహనంగా చేసుకుని తిరగటం మొదలు పెట్టాడు. కొంతకాలానికి పార్వతీ పరమేశ్వరులకు కుమారస్వామి పుట్టాడు. అతడు మహా వీరుడు. నెమలి అతని వాహనము.
విఘ్నేశాధిపత్యము..
ఒకరోజు దేవతలు, మునులు, మానవులు పరమేశ్వరుని పూజించి “విఘ్నములకు ఒక అధిపతిని ఇవ్వండి” అని కోరారు. తాను పెద్దవాడు కాబట్టి ఆ నాయకత్వ పదవి తనకే వుండాలని వినాయకుడు.. వినాయకుడు పొట్టిగా ఉంటాడు కాబట్టి అధిపత్యం తనకే ఇవ్వాలని కుమారస్వామి తండ్రిని కోరారు. అప్పుడు శివుడు వారితో “మీలో ఎవరు మూడు లోకాల్లోని పుణ్య నదుల్లో స్నానమాచరించి ఎవరు తిరిగి ముందుగా నా దగ్గరికి వస్తారో వారికి ఆ ఆధిపత్యం ఇస్తాను” అని చెప్పాడు. దీంతో కుమారస్వామి తన నెమలి వాహనంపై ముల్లోకాలు చుట్టి వచ్చేందుకు వెళ్లగా వినాయకుడు మాత్రం.. నారాయణ మంత్రం జపిస్తూ తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణ చేస్తాడు. ఆ మంత్ర ప్రభావంతో ప్రతి తీర్థంలోనూ కుమారస్వామి కంటే ముందే వినాయకుడు ప్రత్యక్షమై స్నానమాచరించడం జరుగుతుంది. అప్పుడు కుమారస్వామి కైలాసానికి వెళ్లి, మహిమాన్వితుడైన వినాయకుడికే ఆధిపత్యం ఇవ్వమని తండ్రిని కోరతాడు. ఆ విధంగా వినాయకుడు విఘ్నాలకు అధిపతి అవుతాడు. వినాయకుడికి శివుడు భాద్రపద శుద్ధ చవితి నాడు గణాధిపత్యం కట్టబెట్టాడు.
ఆ రోజున తనకు భక్తితో సమర్పించిన ఇష్టమైన పిండి వంటలన్నీ ఆరగించిన గణేశుడికి నడవడం చాలా ఇబ్బందిగా మారింది. అలాగే కైలాసం చేరుకున్న వినాయకుడిని చూసి శివుని శిరస్సుపై ఉన్న చంద్రుడు ఫక్కున నవ్వాడు. చంద్రుని దిష్టికి విఘ్నేశ్వరుడి ఉదరం పగిలి అందులోని ఉండ్రాళ్లు, కుడుములు బయటకు వచ్చి అచేతనుడడంతో పార్వతీదేవి ఆగ్రహంతో ఊగిపోయింది. తన కుమారుడిని చూసి నవ్విన వారిని చూసిన వారు పాపాత్ములై నీలాపనిందలు పొందుదురు గాక అని శపించింది.
ఋషి పత్నులకు నీలాపనిందలు
పార్వతీదేవి చంద్రుని శపించిన సమయంలో సప్తఋషులు భార్యలతో కలసి చేస్తున్న యజ్ఞంలో భాగంగా అగ్నిదేవునికి ప్రదక్షిణం చేస్తున్నారు. అప్పుడు ఋషిపత్నులపై అగ్నిదేవుడికి మోహం కలిగింది. కోరిక తీరక, శపిస్తారేమో అనే భయంతో అగ్ని క్షీణింపసాగాడు. భర్త కోరిక తెలుసుకున్న స్వాహాదేవి ఋషుల భార్యల రూపంలో అగ్నిదేవుడిని చేరింది. అయితే చూసిన సప్త ఋషులు అగ్నిదేవునితో ఉన్నది తమ భార్యలేనని భ్రాంతి చెంది వారిని విడిచిపెట్టారు. శాపగ్రస్థుడైన చంద్రుని చూడటం వలనే ఋషుల భార్యలు నీలాపనిందలకు గురయ్యారని దేవతలు గ్రహించి బ్రహ్మదేవునితో కలిసి కైలాసానికి వెళ్లారు. మరణించిన విఘ్నేశ్వరుడిని బ్రహ్మదేవుడు తిరిగి బతికించాడు. ఆ తతరువాత బుషిపత్నుల విషయంలో జరిగింది చెప్పి శాపాన్ని ఉపసంహరించుకోవాలని కోరారు. దీంతో పార్వతీ మాత శాపాన్ని సవరించింది. ‘ఏ రోజున చంద్రుడు విఘ్నేశ్వరుడిని చూసి నవ్వాడో ఆ రోజు చంద్రుణ్ణి చూడకూడదు’ అని శాపాన్ని సవరించింది. ఆ రోజునుంచి అందరూ భాద్రపద శుద్ధ చవితి నాడు చంద్రుణ్ణి చూడకూడకుండా జాగ్రత్తగా సమస్త మానవాళి ఉంటూ వస్తోంది.
శమంతకోపాఖ్యానం
ద్వాపరయుగంలో ద్వారకలో నివాసం ఉన్న శ్రీకృష్ణుడిని నారదుడు కలిసి ‘స్వామీ! ఈ రోజు వినాయక చవితి. పార్వతి శాపం కారణంగా చంద్రుని చూడకూడదు. నేను వెళ్తాను’ అని కృష్ణుడికి చెప్పి నారదుడు వెళ్లిపోయాడు. వెంటనే శ్రీకృష్ణుడు ఈ విషయాన్ని పట్టణమంతా చాటింపు వేయించాడు. కన్నయ్యకు పాలంటే ఇష్టం ఉండటంతో ఆ రోజు రాత్రి శ్రీకృష్ణుడు ఆవు పాలను తాగుతుండగా పాత్రలోని పాలలో చవితి చంద్రుడి ప్రతిబింబాన్ని చూసి తనకెలాంటి అపనింద వస్తుందోనని కలవరపడ్డాడు. కొన్ని రోజులు గడిచాయి. సత్రాజిత్తు సూర్యుని వరంతో శమంతకమణిని సంపాదించాడు. రోజుకు పది బారువుల బంగారాన్ని ఇచ్చే ఆ మణిని తీసుకుని ద్వారకకు వెళ్లగా.. శమంతకమణిని చూసిన కృష్ణుడు దానిని తనకు ఇవ్వమని కోరాడు. కానీ సత్రాజిత్తు అంగీకరించలేదు. తర్వాత ఒక రోజు సత్రాజిత్తు తమ్ముడు ప్రసేనుడు శమంతకమణిని మెడలో వేసుకుని అడవికి వేటకు వెళ్లగా… అడవిలో ఒక సింహం ఆ మణిని మాంసం ముక్క అనుకుని ప్రసేనుణ్ణి చంపేసింది. అనంతరం ఆ మణిని నోట కరచుకుని పోతుండగా ఆ సింహాన్ని జాంబవంతుడు చంపాడు.
శమంతకమణిని జాంబవంతుడు తన కుమార్తెకు ఇచ్చాడు. మరుసటి రోజు తన సోదరుడి మరణ వార్త విన్న సత్రాజిత్తు శ్రీకృష్ణుడే తన తమ్ముడిని చంపి శమంతకమణిని అపహరించాడని నిందించాడు. భాద్రపద శుద్ధ చవితి రోజు చంద్రబింబాన్ని చూసిన దోషంవల్ల తన మీద నింద పడిందనుకున్నాడు కన్నయ్య. శమంతకమణిని వెదుకుతూ అడవికి వెళ్లగా.. ఒక చోట ప్రసేనుడి శవం కనిపించింది. అక్కడి నుంచి సింహం అడుగులు కనిపించగా.. వాటి ప్రకారంగా ఒక పర్వత గుహలోకి ప్రవేశించాడు. అందులో ఉన్న ఉయ్యాలకు కట్టిన మణిని చూసి, దానిని తీసుకుని బయటకు రావడాన్ని చూసిన జాంబవతి పెద్దగా ఏడ్వసాగింది. కూతురి ఏడుపు విని జాంబవంతుడు కోపంతో శ్రీకృష్ణుడిపై యుద్ధానికి తలపడ్డాడు. వారిద్దరి మధ్య 28 రోజులు యుద్ధం జరిగింది. జాంబవంతుని శక్తి తగ్గిపోవడంతో అప్పుడు ఆయనకు అసలు విషయం తెలిసింది. త్రేతాయుగంలో జాంబవంతుడు శ్రీరాముడితో యుద్ధం చేయాలని కోరాడు. ఆ కోరికను ఇప్పుడు శ్రీకృష్ణుని రూపంలో వచ్చి తీర్చాడని గ్రహించిన జాంబవంతుడు.. శ్రీకృష్ణుడికి నమస్కరించి శమంతకమణితో పాటు తన కుమార్తె జాంబవతిని కూడా ఆయనకు సమర్పించాడు. శ్రీకృష్ణుడు శమంతకమణిని తెచ్చి సత్రాజిత్తుకు ఇచ్చాడు. నిజం తెలుసుకున్న సత్రాజిత్తు తనను క్షమించమని శ్రీకృష్ణుడిని వేడుకుని.. తన కుమార్తె సత్యభామను ఇచ్చి వివాహం జరిపించాడు. శమంతకమణిని కూడా శ్రీకృష్ణుడికి ఇచ్చాడు.
ఆ సమయంలో అక్కడకు వచ్చిన మునులు శ్రీకృష్ణుడితో మీరు సమర్థులు కనుక మీపై పడిన నిందను పోగొట్టుకోగలిగారని… మావంటి వారి గతేంటని ప్రశ్నించారు. అప్పుడు కన్నయ్య.. భాద్రపద శుద్ధ చవితినాడు యథావిధిగా వినాయకుని పూజించి ఈ శమంత కోపాఖ్యానాన్ని విని అక్షతలు తలపై వేసుకున్న వారికి, ఆరోజు చంద్ర దర్శనం అయినా కూడా అపనిందలు కలగవని శ్రీకృష్ణుడు చెప్పాడు. ఆ నాటి నుంచి ప్రతి సంవత్సరం భాద్రపద శుద్ధ చవితి రోజు దేవతలు, మహర్షులు, మనుషులు తమ శక్తికి తగినట్లుగా గణపతిని పూజించి తమ కోరికలు తీర్చుకుంటున్నారు.ఈ కథను చదివి గాని, విని గాని తలపై అక్షతలను వేసుకొని వినాయక వ్రతాన్ని ముగించాలి.