700 ఏళ్ల చరిత్ర కలిగిన కోనేటిని ఇప్పుడు సడెన్‌గా మూసేశారు. అసలు ఏం జరిగింది? ఎందుకు మూసేశారు? అనేది చర్చనీయాంశంగా మారింది. ఇంతకీ ఆ కోనేరు ఎక్కడుందంటారా? మహబూబ్ నగర్ జిల్లా పట్టణానికి ఆనుకొని ఉన్న బాదేపల్లి పెద్దగుట్ట రంగనాయకస్వామి ఆలయంలో ఉంది. భక్తుల పాలిట ఈ ఆలయం కొంగు బంగారంగా కొనసాగుతోంది. రంగనాయకస్వామి స్వయంభువుగా వెలిశాడు. ఎత్తైన గుట్ట.. పచ్చని చెట్ల మధ్య అందమైన ప్రాంతంలో ఉంటుందా ఆలయం. ఈ ఆలయంలో దీపాలు కానీ.. విద్యుత్ వెలుగులు కానీ ఉండవు.
స్వామివారు పవళించిన రూపంలో ఉంటారు. ఎండకి ఎండుతూ.. వానకి తడుస్తూ ఉంటారు స్వామివారు. ఇక ఆలయానికి ఎంత చరిత్ర ఉందో.. అక్కడి కోనేరుకూ అంతే చరిత్ర ఉంది. ఈ కోనేటి నీటితోనే స్వామివారిని అభిషేకిస్తూ ఉంటారు. ఈ కోనేరు జలాన్ని భక్తులంతా అత్యంత పవిత్రంగా భావిస్తూ ఉంటారు. ఈ కోనేటి నీటిని పంటపొలాల్లో చల్లితే చీడపీడల బాధ ఉండదట. ఇంతటి మహత్యమున్న కోనేటిని పూడ్చివేయడం వివాదాస్పదంగా మారింది. ఇది చాలదన్నట్టుగా స్వామివారి ఆలయంలో ముడుపులు కట్టే చెట్టును కూల్చేశారు. గుప్త నిధుల కోసమే ఈ కోనేటిని తవ్వి.. ఆపై భక్తులకు అనుమానం రాకుండా పూడ్చేశారని అనుమానం.