కుజ దోషాలు, సర్ప దోషాలతో బాధపడేవారు చాలా మంది ఉంటారు. వీటన్నింటికీ విముక్తినిచ్చే దేవుడిగా పేరుగాంచాడు రావుల పాలెం సమీపంలోని సుబ్రహ్మణ్యస్వామి. ఈ దోషాలు ఉన్నవారెవరైనా తప్పక ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పు గోదావరి జిల్లా రావులపాలెం సమీపంలో ఉన్న నడిపూడి గ్రామంలో సుబ్రహ్మణ్య స్వామి గుడికి వెళ్లి పూజ చేయించుకుంటారు. స్వయంభువుగా వెలిసిన ఈ స్వామివారు మనకు సర్ప రూపంలో దర్శనమిస్తారు. అత్యంత మహిమాన్వితమైన క్షేత్రాల్లో ఈ ఆలయం కూడా ఒకటి. 1973వ సంవత్సరంలో ఈ ఆలయ నిర్మాణంతో పాటు శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి వార్ల విగ్రహ ప్రతిష్ఠ జరిగింది.
స్థల పురాణం ప్రకారం.. కాటన్ బ్యారేజీ నిర్మాణానికి ముందు సర్ప రూపంలో ఉన్న శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారు సర్ప రూపంలో నాసిక్ నుంచి గోదావరి నదిలో ప్రయాణం చేస్తూ వశిష్ట గోదావరి నదీ ఒడ్డుకు చేరుకున్నారట. కొంతకాలం తర్వాత స్వామివారు ఓ భక్తుడికి కలలో కనిపించి తనకు గ్రామోత్సవం జరిపించాలని కోరారట. అయితే ఈ గ్రామోత్సవంలో పల్లకి ఆగిపోయిన చోట తనని ప్రతిష్టించమని తెలిపారట. ఆ వెంటనే సదరు భక్తుడు గ్రామస్తుల సహకారంతో అరటి దొప్పలతో పల్లకి తయారు చేసి స్వామి వారి గ్రామోత్సవం చేసి.. పల్లకి ఆగిన చోట ఆలయాన్ని నిర్మించారు. ఈ ఆలయంలో స్వామివారికి తూర్పు వైపున ఒక పుట్ట ఉంటుంది. ఈ పుట్టలోనే స్వామివారు ఉంటారని నమ్మకం. దీనిని చూడటానికి ఒక అద్దం ఉంటుంది. రాత్రి పూట నిజంగానే ఈ పుట్టలోకి పాము వెళ్లి.. ఉదయాన్నే బయటకు వెళ్లి పోతుందని భక్తులు చెబుతారు.