
జనక మహారాజుకు వశిష్టుల వారు కార్తీక పురాణం గురించి చెప్పారనుకున్నాం కదా. ఆ కార్తీక పురాణంలోని రెండవ కథను తెలుసుకుందాం. పూర్వం ఒక బ్రాహ్మణునికి నిష్టురి అనే అందమైన కూతురుండేది. ఆమె గయ్యాళి, కాముకురాలు, సకల చెడ్డ గుణాలతో ఉండటంతో కర్కశ అని పిలిచేవారు. పెళ్లి వయసు రాగానే కర్కశను ఆమె తండ్రి మిత్రశర్మ అనే వ్యక్తితో వివాహం జరిపించాడు. మిత్రశర్మ సకల గుణ సంపన్నుడు. పెళ్లి తర్వాత కూడా కర్కశలో మార్పేం లేదు. పైగా భర్తను, కొడుతూ తిడుతూ ఉండేది. అంతటితో ఆగక పరపురుషులతో సంబంధం పెట్టుకుని మిత్రశర్మతో పాటు అతని తల్లిదండ్రులను సైతం హింసించేది.
ఒకరోజు ప్రియుడు చెప్పాడని భర్తను బండరాతితో తల పగలకొట్టి చంపేసి శవాన్ని పాడుబడిన బావిలో వేసింది. విషయం తెలిసినా కూడా ఏమీ చేయలేని మిత్రశర్మ తల్లిదండ్రులు ఇల్లు విడిచి వెళ్లిపోయారు. ఇక కర్కశ మరింత అదుపు తప్పింది. ఎందరో పురుషులతో సంబంధం పెట్టుకుంది. దాన్నొక వ్యాపారంగా మలుచుకుంది. చివరకు జబ్బు పాలైంది. శరీరమంతా పుండ్లు కావడంతో అంతా అసహ్యించుకున్నారు. తిండి లేక రోగాలతో దిక్కులేని చావు తెచ్చుకుంది. యమదూతలు కర్కశను నరకానికి తీసుకెళ్లి చిత్ర హింసలు పెట్టారు.
ఆ తరువాత ఆమె 15 సార్లు కుక్కగా జన్మించింది.15వ సారి ఓ బ్రాహ్మణ గృహంలో ఉండేది. కార్తీక సోమవారం నాడు సదరు బ్రాహ్మనుడు పగలు ఉపవాసముండి నక్షత్ర దర్శనానంతరం ప్రసాద స్వీకారానికి ముందు ఇంటి ముందు బలిని విడిచిపెట్టాడు. రోజంతా ఆహారం దొరక్క పస్తు ఉన్న కుక్క ప్రదోష వేళ ఆ అన్నాన్ని తినేసింది. దీంతో దానికి పూర్వ జన్మ గుర్తొచ్చింది. బ్రహ్మణుడికి తన కథంతా చెప్పి తనకు మోక్షం సిద్ధించే మార్గం చెప్పమని కోరింది. అప్పుడు ఆ బ్రహ్మణుడు జాలితో కార్తీక సోమవార వ్రతాలలో ఒక సోమవార వ్రత ఫలాన్ని ఆ కుక్కకు ధారపోశాడు. ఆ క్షణమే కుక్క తన శునక దేహాన్ని వదిలి దివ్య స్త్రీ శరీరిణియై కైలాసం చేరింది.
