
పెరటాసి మాసం శ్రీనివాసుడికి ఎందుకంత ప్రీతిపాత్రమైనదో తెలుసుకున్నాం కదా. శ్రీ వేంకటేశ్వర స్వామిగా శ్రీమన్నారాయణుడే వేంకటాచలంపై అవతరించిన శుభసందర్భంగానే ఏటా పెరటాసి మాసంలో బ్రహ్మోత్సవాలను నిర్వహించడం ఆనవాయితీ. ఈ మాసంలో జరిగే బ్రహ్మోత్సవాల వైభవాన్ని కళ్లారా చూసి తరించాల్సిందే. భక్తులే కాదండోయ్.. ఈ బ్రహ్మోత్సవాలను తిలకించేందుకు ముక్కోటి దేవతలు సైతం భూమిపైకి తరలి వస్తారని చెబుతారు. ఇక పెరటాసి వ్రతం చేసేవారు ఆచరించాల్సిన నియమాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
పెరటాసి మాసంలో ప్రతి శనివారం పిండి దీపం వెలిగించాలని తెలుసుకున్నాం కదా. ఇలా పిండి దీపం వెలిగించేవారు కొన్ని నియమాలను పాటించాల్సి ఉంటుంది. అవేంటంటే.. నిత్యం సూర్యోదయానికి ముందే నిద్రలేచి శుచిగా స్నానమాచరించి శ్రీ వేంకటేశ్వరుని సుప్రభాతం పఠించాల్సి ఉంటుంది. ఈ 30 రోజుల పాటు తప్పనిసరిగా నుదుటన తిరు నామం ధరించి పూజ పూర్తయ్యే వరకూ ఉపవసాం ఉండాలి. రోజుకు ఒక్కసారి మాత్రమే భుజించాలి. నేలపైనే పడుకోవాలి. బ్రహ్మచర్యం పాటిస్తూ సాత్విక ఆహారం మాత్రమే తీసుకోవాలి. నిత్యం శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయాన్ని సందర్శించి స్వామివారికి నిత్యం చక్కర పొంగలి, కట్టు పొంగలిని నైవేద్యంగా సమర్పించాలి.
