శ్రీమహాలక్ష్మిని ఒకానొక సందర్భంలో నారదుల వారు శపించారట. సాక్షాత్తు లక్ష్మీదేవిని అసలు ఆయన ఎందుకు శపించాల్సి వచ్చిందనేది తెలుసుకుందాం. ఒకప్పుడు కౌశికుడు అనే ఒక గొప్ప విష్ణు భక్తుడు ఉండేవాడు. అతడు గొప్ప సంగీత విద్వాంసుడు. తన గాన మాధుర్యంతో ఏకంగా విష్ణుమూర్తినే ప్రసన్నం చేసుకున్నాడు. కౌశికుడు తన స్థూల శరీరాన్ని విడిచిన అనంతరం విష్ణు లోకానికి చేరుకున్నాడు. కౌశికుడిని చూసిన వెంటనే స్వామివారు ఎదురేగి మరీ తన ప్రియ భక్తుడిని స్వాగతించారు. అనంతరం అతని గౌరవార్థం ఆంతరంగిక సంగీతసభ ఒకటి ఏర్పాటు చేసాడు.
ఈ సభకు నారదుడు, తుంబురుడు సైతం వెళ్లారు. తుంబురునికి సకల మర్యాదలతో స్వాగతం లభించింది కానీ దేవర్షి అయిన నారదుడికి మాత్రం ప్రవేశం లభించలేదు. తనకు ప్రవేశం లభించకపోవడం పెద్ద విషయం కాదు కానీ తన ప్రత్యర్థి అయిన తుంబురునికి స్వాగతం లభించడం మాత్రం ఆయనకు ఇబ్బందిగా అనిపించింది. దీంతో నారదుడికి పట్టరాని కోపం వచ్చింది. అయినా తమాయంచుకున్నాడు. లక్ష్మీదేవి మందిరంలోకి వెళ్లేందుకు యత్నించాడు. అక్కడ కూడా అమ్మవారి చెలికత్తెలు ఆయనను అడ్డుకున్నారు. నారదుడికి పట్టరాని కోపం వచ్చింది. ఇక భరించలేక మహాలక్ష్మిని శపించాడు.