స్త్రీలను రక్షించడం కోసమే కన్నయ్య అవతరించాడనడానికి కారణమేంటంటే..

భగవానుడైన శ్రీకృష్ణుడు ‘తాను స్త్రీలను రక్షించడం కోసమే అవతరించినవాడు’ అనే విషయాన్ని లోకానికి అంతటికి తెలియజేసినవాడు. ఒక స్త్రీ చేసిన శపథాన్ని నెరవేర్చడం కోసమే చాలా తక్కువ కార్యమైన దౌత్యాన్ని చేశాడు. అర్జునుడికి సారథి అయ్యాడు. అందుకోసమే భగవద్గీతను అర్జునుడికి ఉపదేశించాడు. వినడానికి విచిత్రంగా అనిపించినా మహాభారతాన్ని గమనిస్తే ఈ విషయం మీకు అవగతమవుతుంది. కౌరవసభలో ద్రౌపది శపథం చేసిన విషయం తెలిసిందే. ద్రౌపది చేసిన శపథాన్ని తప్పక పూర్తి చేయాలి. అప్పుడు చాలా వయసులో పెద్దవారు కానీ, జ్ఞానంలో పెద్దవారు కానీ, చివరికి రాజ్యంలో ఎవ్వరూ దానికోసం ముందుకు రాలేదు. ఏ ప్రయత్నమూ చేయలేదు.

ఒక్క భీముడు మాత్రం ‘ద్రౌపదికి అన్యాయం చేసిన వీరిని వధించి తీరతాను!’౼ అని అన్నాడు. అయితే సభలో ద్రౌపది ఎవరినీ నమ్మలేదు; ఎక్కడో ద్వారకలో ఉండే శ్రీకృష్ణుడిని వేడుకుంది. ఆ శ్రీకృష్ణుడే ఆమెను ఆ ఆపద నుండి కాపాడాడు. నిజానికి శ్రీకృష్ణుడు కాక వేరొకరెవరైనా ఒకరు దూతగా వెళ్లి ఉంటే, యుద్ధ నివారణ జరిగి ఉండేదేమో! అందుచేత శ్రీకృష్ణుడే స్వయంగా పాండవ దూతగా వెళ్లి, యుద్ధం కోసం ఇరుపక్షాలను ప్రేరేపించాడు. అర్జునునకు రథసారథి అయ్యాడు. శ్రీకృష్ణుడు కాకుండా వేరొకడు అర్జునులకు సారధి అయి ఉంటే, అర్జునుడు కోరిన విధంగా రథాన్ని నడిపి ఉండేవారు. అయిన వారిని వధించలేక అస్త్ర సన్యాసానికి అర్జనుడు సిద్ధపడినప్పుడు గీతోపదేశం చేసి మరీ శ్రీకృష్ణుడు యుద్ధానికి ప్రోత్సహించి కురుక్షేత్ర యుద్ధం జరిపించాడు. అలా ఒక స్త్రీ చేసిన శపథాన్ని శ్రీకృష్ణుడు నెరవేర్చాడు.

Share this post with your friends