మానవులకు ఛాన్స్ దొరికితే స్వర్గాన్నే కోరుకుంటారు తప్ప.. నరకాన్ని ఎవరూ కోరుకోరు కదా. అప్పట్లో మానవులు బీభత్సంగా తపస్సులు చేసేసి అందరూ ఒకరి తర్వాత ఒకరు స్వర్గానికి వెళ్లారట. దంతో స్వర్గం మొత్తం మానవులతో నిండిపోయిందట. సంఖ్యాబలం పెరిగే సరికి వీరంతా దేవతల మీదే పెత్తనం చేయడం ప్రారంభించారు. స్వర్గలోకంలో మానవులు ఆడిందే ఆటగా.. పాడిందే పాటగా ఉందట. దీంతో భయపడిన దేవతలతో పాటు దేవేంద్రుడు సైతం భయపడిపోయాడట. వెంటనే కైలాసానికి పయనమయ్యాడట.
కైలాసంలో పార్వతీపరమేశ్వరుల వద్దకు వెళ్లి వాళ్లను మనస్ఫూర్తిగా నమస్కరించి తన బాధను వారి వద్ద వెళ్లగక్కాడట. రాను రాను దేవలోకంలో మానవుల సంఖ్య పెరుగుతోందని.. వారంతా దేవతలను వేధిస్తున్నారని కాపాడమని వేడుకున్నాడట. అప్పుడే పార్వతీ మాత మట్టితో వినాయకుడిని సృష్టిస్తోందట. అనంతరం వినాయకుడు పార్వతీ మాతకు నమస్కరించి తానేం చేయాలో చెప్పమన్నాడట. అప్పుడు వినాయకుడిని భూలోకానికి వెళ్లాలని.. అక్కడ మోక్షం పొంది స్వర్గానికి వెళ్లాలనుకుంటున్న వారందరికీ విఘ్నాలు కలిగించాలని చెప్పిందట. నీకు నంది, మహాకాలుడు సహాయకులుగా ఉంటారని చెప్పడంతో గణేశుడు భూలోకానికి వచ్చి మానవుల పనులకు విఘ్నాలు కలిగించడం ప్రారంభించాడట.