శ్రావణ మాసంలోని కృష్ణ పక్షంలోని అష్టమి తిథి రోజున శ్రీ కృష్ణుడు జన్మించాడు. కాబట్టి ప్రతిఏటా శ్రావణ మాసంలో కన్నయ్య జన్మదినోత్సవం జరుపుకుంటూ ఉంటాయి. నిన్న కన్నయ్య పుట్టినరోజు వేడుకలు పూర్తయ్యాయి. ఇక నేడు దహీ హండి అంటే ఉట్టి కొట్టే ఉత్సవాన్ని దేశమంతా జరుపుకుంటోంది. భక్తులంతా పెద్ద ఎత్తున ఒకచోట చేరి దహీ హండి ఉత్సవాన్ని జరుపుకుంటున్నారు. ముఖ్యంగా ఇది మధుర, బృందావనంలో అయితే పెద్ద ఎత్తున జరుగుతుంది. ఇక మిగిలిన ప్రాంతాల్లోనూ ఆ స్థాయిలో కాకున్నా బాగానే జరుగుతోంది. పాలు, పెరుగు, వెన్న కుండలతో ఉట్టిని తయారు చేస్తారు.
ఇక కొంతమంది కలిసి పిరమిడ్ మాదిరి ఒకరిపై ఒకరు ఎక్కి ఉట్టి కొడతారు. కన్నయ్యకు పాలు, పెరుగు, వెన్న అంటే చాలా ఇష్టం. అవి కినపిస్తే చాలు దొంగతనానికి సైతం వెనుకాడేవాడు కాదు. గోపికలు తీసుకుని వెళ్లే పాలు, పెరుగు కుండలను పగులగొట్టడం.. వారి ఇంట్లో దాచిన వెన్నను దొంగిలించి తినడం చేసేవాడు. విసుగు చెందిన గోపికలు వెన్న, పెరుగు కుండలను తమ ఇంట్లో ఉట్టిలో పెట్టి వేలాడదీసేవారు. దానిని కూడా కన్నయ్య వదిలేవాడు కాదు. స్నేహితుల సాయంతో పగులగొట్టి తినేవాడు. శ్రీకృష్ణుడి చిలిపి చేష్టలకు గుర్తుగానే ఉట్లోత్సవంను జరుపుకుంటూ ఉంటారు.