వినాయకుడి విగ్రహం నిమజ్జనం వెనుక అసలు కథేంటంటే..

భాద్రపద సుద్ద చవితి రోజు నుంచి అనంత చతుర్దశి వరకూ మనం వినాయకుడికి పెద్ద ఎత్తున పూజలు నిర్వహిస్తూ ఉంటాం. పది రోజుల పాటు ఊరూ వాడ అంతటా సందడి నెలకొంటుంది. ఇక పదవ రోజున వినాయకుడిని గంగమ్మ ఒడికి చేరుస్తారు. ఒకరకంగా పది రోజులూ ఒక ఎత్తు.. నిమజ్జనం మరో ఎత్తు. ఇది అత్యంత ధూమ్ ధామ్‌గా జరుగుతుంది. డీజేలు, డ్యాన్స్‌లు, అన్నదానాలు, మేళతాళాల నడుమ గణేషుడిని అత్యంత భక్తి శ్రద్ధలతో గౌరవంగా నిమజ్జనం చేస్తారు. అయితే అసలు వినాయకుడిని ఎందుకు నిమజ్జనం చేస్తారు? కారణం తెలుసుకుందాం.

అప్పట్లో తొలిసారిగా వినాయక చవితిని ఛత్రపతి శివాజీ మహారాష్ట్రలోనూ.. పశ్చిమ బెంగాల్‌లో బాల గంగాధర్ తిలక్ ప్రారంభించారని చెబుతారు. పూర్వ కాలంలో మాత్రం శాతవాహనులు, చోళులు నిర్వహించారని అంటారు. అయితే నిమజ్జనానికి ఓ శాస్త్రీయ కారణం చెబుతారు. వినాయక చవితి ప్రతి ఏటా వర్షాకాలంలో వస్తుంది. ఆ సమయంలో చెరువుల నుంచి మట్టి తెచ్చి.. వినాయకుడిని తయారు చేసి వివిధ ప్రాంతాల నుంచి 21 రకాల పత్రిని తీసుకొచ్చి పూజిస్తారు. అనంతరం పత్రితో కలిపి వినాయకుడిని నీటిలో నిమజ్జనం చేస్తారు. అలా చేయడం వల్ల నీరు సులభంగా ప్రవహించడంతో పాటు నీరు శుభ్రంగానూ.. ఆయుర్వేద గుణాలను సైతం సంతరించుకుంటుందట. మట్టితో తయారైనా ఏ విగ్రహంలో అయినా దైవం 9 రోజులు మాత్రమే ఉంటుందట. ఆ తరువాత మాయమవుతుందట. అందుకే 9 రోజుల పాటు పూజించి పదవ రోజున నిమజ్జనం చేస్తారు. ఇక పురాణాల ప్రకారం అయితే వినాయకుడు అనంత చతుర్దశి రోజున తన తల్లిదండ్రులైన పార్వతీపరమేశ్వరుల దగ్గరికి వెళ్తాడు.

Share this post with your friends