
నిన్నటి నుంచి చాతుర్మాసం ప్రారంభమైంది. ఈ చాతుర్మాసం గురించి ప్రాచుర్యంలో ఓ ఇతిహాసం ఉంది. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం. బ్రహ్మ దేవుడు సృష్టి నిర్మాణం చేస్తూ అలసిపోయి నిదురించాడట. అది గమనించిన దేవతలు ఒక యజ్ఞం చేసి, అందులోంచీ ఉద్భవించిన హవిస్సును బ్రహ్మకు ఇచ్చారట. అది ఔషధంలా పని చేసి ఆయన అలసటను పోగొట్టిందట. ఆ యజ్ఞమే వ్రతంగా చెప్పబడింది. నియమనిష్ఠలతో, శ్రద్ధతో నిర్వహించే కర్మానుష్ఠానమే వ్రతం. బ్రహ్మ సృష్టి కార్యం చేస్తూ ‘ఏకం’, ‘ద్వే’, .త్రీణీ’, ‘చత్వారే’ అంటూ నాలుగు సార్లు ఆజ్యాన్ని సమర్పించి, చివరగా ఒక సమిధను కూడా వేశాడు.
ఫలితంగా- దేవతలు, దానవులు, పితరులు, మానవులు అనే నాలుగు రకాల జీవులను సృష్టించి, వారికి రోమములు, మజ్జ మాంసములు, ఎముకలను కూడా ఇచ్చాడు. ‘మాసం’ అనే పదానికి జ్ఞానం అనే అర్థం ఉంది. ‘ఈ నాలుగు రకాల జీవులలో జ్ఞానాన్ని ఉంచడం కూడా ఈ వ్రత దీక్ష లక్ష్యం’ అని తైత్తరీయ బ్రాహ్మణం అంటోంది. మరొక నిర్వచనం ప్రకారం చతుర్ముఖుడైన బ్రహ్మ లక్ష్మితో కలిసి సృష్టి చేశాడు. ‘చతుః+ మా+అస్యం చాతుర్మాస్యం’. నాలుగు లక్ష్ములు ముఖాలుగా- నాలుగు వేదాలు చెప్పినవాడు బ్రహ్మ. వేదలక్ష్మే శ్రీవిద్య. ఈ నాలుగు నెలలూ- ప్రతి రోజూ వేదాలను పూజించాలి. అధ్యయనం, అధ్యాపనం చేయడం ముఖ్యమైన అనుష్ఠామంగా భావన చేయాలని ఉపనిషత్తు అంటోంది.
