మంగళ గౌరీ వ్రతం తోరములను తయారు చేసుకునే వరకూ తెలుసుకున్నాం. ఈ వ్రతం గురించి శ్రీకృష్ణ పరమాత్ముడు ద్రైపదికి వివరించాడని కూడా తెలుసుకున్నాం. ఇక మంగళ గౌరీ వ్రతంలో ముఖ్య ఘట్టమేంటి? తదితర విషయాలను తెలుసుకుందాం. తోరములను తయారు చేసుకున్న తర్వాత పార్వతీదేవి చిత్రపటాన్ని పసుపు కుంకుమలతో అందంగా అలంకరించిన పీటపై ఉంచాలి. అనంతరం అమ్మవారికి కూడా అలంకరణ చేయాలి. అమ్మవారికి గంధం, కుంకుమ పెట్టి అనంతరం పువ్వులతో అలంకరించి ఆచమనం చేయాలి. ఆ తరువాత సంకల్పం చెప్పుకొని పూజను ప్రారంభించాలి.
ముందుగా అమ్మవారిని మంత్రపూర్వకంగా ఆవాహనం చేయాలి. ఆ తరువాత సకల షోడశోపచారాలు చేయాలి. ముందుగా అధాంగ పూజ.. ఆపై అష్టోత్తర శతనామాలతో అమ్మవారిని స్మరించుకోవాలి. ఆ సమయంలో పుష్పాక్షతలతో అమ్మవారికి అర్చన చేయాలి. పూజ పూర్తయ్యాక కొబ్టరికాయ కొట్టి నైవేద్యం సమర్పించారు. ఆ తరువాత అమ్మవారికి హారతి ఇవ్వాలి. మంగళ గౌరీ వ్రతంలో ముఖ్య ఘట్టం కాటుకను పారించడం. అంటే ఒక అట్లకాడకు ఆవు నెయ్యి పూసి దీపారాధన మీద ఉంచితే చెక్క అట్లకాడ నల్లగా కాలి కాటుక పారుతుంది. ఈ కాటుకను అమ్మవారికి పెట్టి మనం కూడా పెట్టుకోవాలి. ఆ తరువాత వాయినం అందుకోవడానికి వచ్చిన ముత్తైదువలకు కూడా పెట్టాలి.