శ్రీ పద్మావతీ పరిణయోత్సవాల్లో మొదటిరోజు వైశిష్ట్యం ఏంటంటే..

తిరుమలలోని నారాయణగిరి ఉద్యానవనాల్లో వివిధ సువాసనలు వెదజల్లే రంగురంగుల పుష్పాలతో భూలోక వైకుంఠాన్ని తలపించే రీతిలో అలంకరించిన మండపంలో శుక్రవారం శ్రీపద్మావతి పరిణయోత్సవాలు శోభాయమానంగా ప్రారంభమయ్యాయి. మే 19వ తేదీ వరకు ఈ ఉత్సవాలు జరుగనున్నాయి. ఇక మొదటి రోజు వైశిష్ట్యం ఏంటంటే.. శ్రీ పద్మావతి పరిణయోత్సవాల్లో మొదటిరోజు అంటే వైశాఖశుద్ధ నవమి రోజైన శుక్రవారం నాడు శ్రీమలయప్ప స్వామివారు గజవాహనాన్ని అధిరోహించగా ఉభయనాంచారులు పల్లకిపై పరిణయోత్సవ మండపానికి సాయంత్రం 5.30 గంటలకు వేంచేశారు.

శోభాయమానంగా తీర్చిదిద్దిన పెండ్లిమండపంలో నిత్య నూతన వధూవరులైన శ్రీస్వామివారికి, అమ్మవార్లకు ఎదుర్కోలు, పూలదండలు మార్చుకోవటం, పూలబంతులాట, నూతన వస్త్ర సమర్పణ కోలాహలంగా జరిగాయి. ఆ తరువాత శ్రీస్వామివారికి కొలువు (ఆస్థానం) జరిగింది. ఈ క్రతువుల అనంతరం చతుర్వేద పారాయణం, మలహారి, దేశిక, సౌరాష్ట్ర, వారహి, కాదన కుతూహల, నీలంబారి రాగాలు, వివిధ తాళాల వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్ల కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. అనంతరం ఆర్జిత భక్తులకు వస్త్ర బహుమానం, ప్రసాద వితరణ జరిగింది. ఆ తరువాత శ్రీదేవి భూదేవి సహితుడైన స్వామి బంగారుతిరుచ్చిపై అశేష భక్తజనం మధ్య ఊరేగుతూ ఆలయ ప్రవేశం చేయడంతో తొలిరోజు వివాహ వేడుక ఘనంగా ముగిసింది.

Share this post with your friends