యమ ధర్మరాజు విదురుడిగా ఎందుకు జన్మించాల్సి వచ్చింది? అంటే అది కర్మ ఫలితం. గత జన్మలో చేసిన మంచి చెడుల ఆధారంగానే మన మరో జన్మ ఉంటుందని హిందువులు నమ్ముతారు. యమధర్మరాజు కూడా ఓ మహిర్షి శాపం కారణంగా విదురుడుగా జన్మించాడు. అసలు మహర్షి ఆయనకు శాపం ఎందుకు ఇచ్చాడు? అంటే దానికో కథ ఉంది. పురాణాల ప్రకారం ఓ మహర్షి శాపం కారణంగా మహాభారత కాలంలో యముడు ఓ పనిమనిషికి జన్మించాడు. ఒకసారి కొందరు దొంగలు ఒక రాజు ఖజానా నుంచి డబ్బు దొంగిలించారు. ఇది గుర్తించిన సైనికులు దొంగల కోసం నలువైపులా జల్లెడబడుతున్నారు. దొంగలకు ఇక తప్పించుకోవడం దుర్లభమని అర్థమైంది. దీంతో తాము దొంగిలించిన సొమ్మంతా మాండవ్య మహర్షి ఆశ్రమంలో దాచిపెట్టి, అక్కడి నుంచి పారిపోయారు.
దొంగలను వెంబడిస్తున్న సైనికులు మాండవ్య మహర్షి ఆశ్రమానికి చేరుకున్నారు. అక్కడ వెదకగా దొంగలు దొంగిలించిన సొమ్మంతా లభ్యమైంది. మహర్షే దానిని దొంగిలించాడనుకుని ఆయనను తీసుకెళ్లి రాజు ముందు నిలబెట్టారు. రాజు మహర్షికి మరణశిక్ష విధించారు. కానీ సైనికులు ఎంత ప్రయత్నించినా మహర్షి మరణించలేదు. ఈ విషయం తెలుసుకున్న రాజు.. మహిర్షి వద్దకు వచ్చి మన్నించమని వేడుకున్నాడు. అప్పుడు మిమ్మల్ని కాదు… ఆ యమధర్మరాజునే ప్రశ్నిస్తానంటూ మహర్షి తన తపోశక్తితో యముడి వద్దకు వెళ్లి తననెందుకు శిక్షించాల్సి వచ్చిందని ప్రశ్నించాడు. మీరు చిన్నతనంలో సీతాకోకచిలుకను ముల్లుతో పొడిచారని, ఆ పాపం కారణంగా శిక్షింపబడ్డారని మహర్షితో యముడు చెప్పాడు. శాస్త్రాల ప్రకారం అజ్ఞానం వల్ల ఎవరైనా పాపం చేస్తే కలలో శిక్ష అనుభవించాల్సి ఉంటుందని.. తనను శాస్త్ర విరుద్ధముగా శిక్షించావని మండిపడి యముడికి మహర్షి శాపం ఇస్తాడు. ఆ శాప ఫలితంగానే కురు వంశంలో దాసి కొడుకుగా విదురుగా యమధర్మరాజు జన్మించాడు.