
వ్రతాలు, నోముల్లో తాంబూలం చాలా ముఖ్యం. వ్రతాలు, నోములు నోచుకోవాలనుకున్న వారు తమ స్తోమతకు తగినట్టుగా ముత్తైదువులను పిలుచుకుంటారు. వ్రతం, నోము పూర్తైన తర్వాత ముత్తైదువులకు తాంబూలం ఇవ్వడం ఆనవాయితీ మాత్రమే కాకుండా అది మన సంప్రదాయం కూడా. తాంబూలంగా ఆకు, వక్క, నానబెట్టిన పెసలు, శనగలతో పాటు స్తోమత ఉన్నవారు చీర లేదంటే జాకెట్ ముక్కను సమర్పిస్తారు. అసలు తాంబూలం ఎందుకు ఇస్తారు? తాంబూలంగా పైన పేర్కొన్న వాటిని మాత్రమే ఎందుకు ఇస్తారు? ముందుగా ఇవన్నీ తెలుసుకుందాం.
తాంబూలంలో భాగంగా మనం ఇచ్చే వాటి కారణంగా చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఆకు, వక్క, సున్నం దానం చెయ్యటం వల్ల సూర్య, కుజ, చంద్ర దోషాలు పరిహారం అవుతాయి. అలాగే నానబెట్టిన పెసలు, శనగలు వాయినంగా ఇవ్వటం వల్ల బుధ, గురు గ్రహ దోషాలు తొలగిపోతాయని విశ్వాసం. ఇన్ని దోషాలకు పరిహారం కాబట్టే.. వీటన్నింటినీ తాంబూలంగా సమర్పిస్తారు. అందుకే నోములు, వ్రతాలలో తాంబూల దానానికి అంతటి ప్రాధాన్యం ఉంది. వ్రతాలకు సంబంధించిన వివరాలు స్కాంద పురాణంలో ఉన్నాయి. స్కందుడు అంటే కుమారస్వామి.. ఆయనకు సంబంధించినదే స్కాంద పురాణం.
