కొన్ని ఆలయాలు వింతలూ విశేషాలకు నిలయాలు. తాజాగా ఒక ఆలయంలో కొందరిని తేనెటీగలు వెంటపడి మరీ కుడతాయట. అసలు వారు ఎవరు? ఆ ఆలయం ఎక్కడుంది? వంటి విషయాలు తెలుసుకుందాం. ఆ ఆలయం శ్రీ నెమలిగుండ్ల రంగనాయక స్వామి ఆలయం . ఇది ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గంలోని రాచర్ల మండలం జేపీ చెరువు గ్రామ సమీపంలో ఉంది. ఇక్కడ ప్రకృతి అందాల నడుమ స్వామివారు కొలువై ఉంటారు. ఈ ఆలయంలో నల్లమల అటవీ ప్రాంతంలో ఉంటుంది. ప్రతి శనివారం ఈ ఆలయానికి భక్తులు పెద్ద ఎత్తున వస్తుంటారు.
ఇక ఈ ఆలయానికి వెళ్లాలంటే శుచిగా, శుభ్రంగా వెళ్లాలి. శుభ్రంగా వెళ్లని వారిని తేనెటీగలు తరిమి తరిమి కుడతాయట. ఈ విషయం ఎన్నోసార్లు రుజువైందని స్థానికులు చెబుతారు. కాబట్టి ఈ ఆలయానికి వచ్చేవారు శుచిగా.. శుభ్రంగా వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు. ఆలయ సమీపంలో ఉన్న నీటి గుండం మరో ప్రత్యేకత. ఇక్కడ కొలువైన రంగనాయక స్వామివారిని సాక్షాత్తు విష్ణుమూర్తి అవతారంగా భావిస్తూ ఉంటారు. అయితే శుచిగా రాని భక్తులను తేనెటీగలు తరిమిన సమయంలో గోవింద నామ స్మరణ చేస్తే తేనెటీగలు కుట్టవని చెబుతారు. ప్రతి వేసవి కాలంలో ఈ ఆలయంలో బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తూ ఉంటారు.