శ్రీవారికి నిర్వహించే అణివార ఆస్థానం, చారిత్రక నేపథ్యం, ఉత్సవ విశిష్టత ఏంటంటే..

తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో నిర్వహించే కొన్ని ప్రత్యేక కార్యక్రమాల్లో ఆణివార ఆస్థానం ఒకటి. దీనిని ఈ నెల 16న నిర్వహించనున్నారు. అసలు ఈ ఆణివార ఆస్థానం చారిత్రక నేపథ్యం, ఉత్సవ విశిష్టత ఏంటో తెలుసుకుందాం.

సాధారణంగా ప్రతి సంవత్సరం సౌరమానం ప్రకారం దక్షిణాయన పుణ్యకాలంలో కర్కాటక సంక్రాంతినాడు ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తారు. అయితే సౌరమానాన్ని అనుసరించే తమిళుల కాలమానం ప్రకారం ఆణిమాసం చివరి రోజున నిర్వహించే కొలువు కావడంతో ఆణివార ఆస్థానం అని పేరు. పూర్వం మహంతులు దేవస్థాన పరిపాలనను స్వీకరించిన రోజు అయిన ఈ ఆణివార ఆస్థానం పర్వదినంనాటి నుండి టీటీడీ వారి ఆదాయ వ్యయాలు, నిల్వలు తదితర వార్షిక లెక్కలు ప్రారంభమయ్యేవి. టీటీడీ ధర్మకర్తల మండలి ఏర్పడిన తరువాత వార్షిక బడ్జెట్‌ను మార్చి – ఏప్రిల్‌ నెలలకు మార్చారు.

ఉత్సవ విశిష్టత ఏంటంటే..

ఈ ఉత్సవం రోజున ఉదయం 7 గంటలకు బంగారువాకిలి ముందు గల ఘంటా మండపంలో సర్వభూపాల వాహనంలో ఉభయదేవేరులతో కూడిన శ్రీ మలయప్పస్వామివారు గరుత్మంతునికి అభిముఖంగా కొలువుకు వేంచేపు చేస్తారు. మరో పీఠంపై స్వామివారి సర్వసైన్యాధ్యక్షుడైన శ్రీవిష్వక్సేనులవారు దక్షిణాభిముఖంగా వేంచేపు చేస్తారు. ఈ ఉత్సవమూర్తులతో పాటు ఆనందనిలయంలోని మూలవిరాట్టుకు ప్రత్యేకపూజలు, ప్రసాదాలు నివేదిస్తారు.

Share this post with your friends