
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు గురువారం ఉదయం శాస్త్రోక్తంగా ధ్వజారోహణంతో ప్రారంభమయ్యాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకూ వివిధ కార్యక్రమాలను నిర్వహించారు. ఉదయం అమ్మవారికి సుప్రభాత సేవ, సహస్ర నామార్చన, నిత్య అర్చన జరిపారు. అనంతరం ఉదయం 6.30 గంటలకు నాలుగుమాడ వీధుల్లో తిరుచ్చి ఉత్సవం జరిపి, ధ్వజ స్థంభ తిరుమంజనం నిర్వహించారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల మొదటిరోజైన గురువారం రాత్రి శ్రీ పద్మావతి అమ్మవారు మురళి కృష్ణుడి అలంకారంలో పిల్లనగ్రోవి ధరించి చిన్నశేషవాహనంపై అభయమిచ్చారు.
మొదటి వాహనం చిన్నశేషుడు. చిన్నశేష వాహనంపై అమ్మవారు జీవకోటిని ఉద్ధరించే లోకమాతగా దర్శనమిస్తారు. శేషభూతమైన ఈ ప్రపంచం సిరులతల్లి రక్షణలో సుఖాన్ని పొందుతోంది. ఈ వాహనంపై అమ్మవారి దర్శనం వల్ల యోగసిద్ధి చేకూరుతుందని భక్తుల విశ్వాసం. వాహనసేవలో శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్ స్వామి, ఈవో జె.శ్యామల రావు దంపతులు, జెఈవోలు శ్రీ వీరబ్రహ్మం, శ్రీమతి గౌతమి, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ గోవింద రాజన్, ఆలయ అర్చకులు శ్రీ బాబుస్వామి, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ చలపతి, శ్రీ సుభాష్, ఏవీఎస్వో సతీష్ కుమార్, ఇతర అధికారులు, పాల్గొన్నారు.
