ఆరుపడైవీడు ఆలయం గురించి తెలుసుకున్నాం కదా.. తమిళనాడు మధురై జిల్లాలో ఈ తిరుప్పరన్‌కుండ్రం ఉంది. కొండ దిగువన శిలలను తొలిచి దీనిని నిర్మించారు. ఇది అద్భుతమైన శిల్పకళకు ప్రతీకగా చెబుతారు. ఆరుపడైవీడులో ఈ ఆలయం మొదటిది కావడం విశేషం. ఈ ఆలయ శిల్పకళకు నిదర్శనమని.. ఆరు ఆలయాల్లోని ఐదు ఆలయాల్లో స్వామివారు కూర్చుని దర్శనమిస్తుండగా.. ఇక్కడ మురుగన్ నిలుచుని అభయమిస్తున్నాడని తెలుసుకున్నాం కదా. ఇక్కడ మరో విశేషం ఏంటంటే.. దేవలోక అధిపతి ఇంద్రుడు తన కుమార్తె దేవయానిని కార్తికేయుడికి ఇచ్చి వివాహం జరరిపిన ప్రదేశం ఇదేనట.
ఈ ఆలయంలో అద్భుతమైన దేవతా చిత్రాలు మనకు దర్శనమిస్తాయి. దేవయాని సమేతుడైనస్వామి చుట్టూ త్రిలోక సంచారి నారద మునీంద్రుడు, ఇంద్రుడు, బ్రహ్మ, సరస్వతి మాత, సూర్యచంద్రులు, గంధర్వులు ఉన్న చిత్రాలు మనల్ని చూపుతిప్పుకోనివ్వవు. ఇక్కడ మరో విశేషం ఏంటంటే.. ఏ ఆలయంలోనైనా అభిషేకం మూలవిరాట్టుకే కదా చేస్తారు. కానీ ఇక్కడ దీనికి భిన్నంగా స్వామివారి ఆయుధమైన వేలాయుధానికి అభిషేకం చేస్తారు. స్వామివారు ఇక్కడికి సూరపద్ముడి సంహారం అనంతరం వేలాయుధంతో ఇక్కడికి వచ్చాడని పురాణాలు చెబుతున్నాయి. ఈ వేలాయుధాన్ని పెరటాసి మాసంలో కొండపై ఉన్న కాశీవిశ్వనాధుని ఆలయానికి తీసుకువెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.