అమ్మవారి వైభవం నాలుగు రకాలని చెబుతుంటారు. అలాగే అమ్మవారి సౌందర్యం కూడా నాలుగు రకాలట. స్థూల సౌందర్యం, సూక్ష్మ సౌందర్యం, సూక్ష్మేతర సౌందర్యం, సూక్ష్మతమ సౌందర్యమని నాలుగు రకాలు. స్థూల సౌందర్యమనేది మనకు కనిపించే అమ్మవారి రూపం. ఈ రూపం మనకు ఆనందాన్నిస్తుంది. దీని వెనుక సూక్ష్మ రూపం ఉంటుందట. ఈ సూక్ష్మ సౌందర్యం తరువాత వరుసగా మిగిలిన రెండు సౌందర్యాలైన సూక్ష్మేతర, సూక్ష్మేతమ సౌందర్యాలుంటాయి. ఇక ఈ స్థూల సౌందర్యంలో అమ్మవారిని ధ్యానిస్తే మనకు మరో అంతరార్థం గోచరిస్తుందట.
ఈ ధ్యానించే ముందు అమ్మవారి స్వరూపమనేది ఎలా వచ్చిందో తెలుసుకోవాలి. దీనికి ఒక కథ ఉంది. భండాసురుడనే రాక్షసుడి బాధ తాళలేక దేవతలంతా వెళ్లి పరమశివుడిని తమను రక్షించమని వేడుకున్నారట. అప్పుడు శంకరుడు తన దృగగ్ని నుంచి ఒక అగ్నిహోత్రాన్ని రగిల్చి.. దేవతల శక్తులననింటినీ ఆ అగ్నిలో పడేయించాడట. అలా వేసిన తర్వాత అందులో నుంచి అమ్మవారు పుట్టిందట. దేవతలు ఆ రకంగా తమ అహంకారం ఈశ్వరరార్పణం చేసి దాని నుంచి శక్తిని పుట్టించారట. అంటే ఆ తల్లిలో దేవతందరి శక్తులూ ఉన్నాయట. దీనర్థం దేవతలంతా ఇచ్చిన శరీరంతో అమ్మ పుట్టిందని కాదు.. అమ్మ ఇచ్చిన శక్తితో ఆ రాక్షసుడి బారి నుంచి దేవతలందరూ తమను తాము రక్షించుకున్నారట. దీని పరమార్థం తెలుసుకున్న దేవతలకు శక్తిస్వరూపిణి అయిన అమ్మవారు కళ్లెదుట కనిపించిందట.