భారతీయ వాఙ్మయములో రామాయణము ఆదికావ్యముగాను, దానిని రచించిన వాల్మీకి మహామునిని ఆదికవిగాను పేర్కొంటారు. చాలా భారతీయ భాషలలోను, ప్రాంతాలలోను ఈ కావ్యము ఎంతో ఆదరణీయము, పూజనీయము. రామాయణంలోని విభాగాలను కాండములు అంటారు. ఒక్కో కాండము కొన్ని సర్గలుగా విభజింపబడింది. వీటిలో బాల కాండ మొదటి కాండము. ఇందులో 77 సర్గలు ఉన్నాయి. ఈ కాండములోని ప్రధాన కథాంశాలు: కథా ప్రారంభము, అయోధ్యా నగర వర్ణన, రాముని జననం, బాల్యము, విశ్వామిత్రుని వద్ద శిష్యరికం, యాగపరిరక్షణ, సీతా స్వయంవరము, సీతారామ కల్యాణము, పరశురామునితో స్పర్ధ, అయోధ్యాగమనం వంటి అంశాలున్నాయి.
ఇక్ష్వాకు వంశానికి చెందిన దశరథుడు సంతానం లేనందున ఆ మహారాజు చింతాక్రాంతుడైనాడు. మంత్రులు, గురువుల దీవెనలతో యాగం చేయ తలపెట్టాడు. ఋష్యశృంగుడు ఋత్విక్కుగా అశ్వమేధయాగంతో పాటు పుత్రకామేష్టి యాగాన్ని దశరథుడు చేశాడు. ఆ యాగం వల్ల శ్రీ మహావిష్ణువు తాను రావణ సంహారార్ధమై తన నాలుగు అంశలతో దశరథ మహారాజునకు నలుగురు కుమారులుగా మానవ జన్మ ఎత్తడానికి సంకల్పించాడు. యజ్ఞపురుషుడిచ్చిన పాయసాన్ని దశరథుడు తన భార్యలైన కౌసల్య, కైక, సుమిత్రలకిచ్చాడు. వారు తేజోవతులై గర్భము దాల్చారు. చైత్ర నవమి నాడు, పునర్వసు నక్షత్ర కర్కాటక లగ్నంలో, గురూదయ సమయంలో కౌసల్యకు రాముడు జన్మించాడు. కైకకు పుష్యమీ నక్షత్రయుక్త మీన లగ్నంలో భరతుడు జన్మించాడు. సుమిత్రకు ఆశ్లేషా నక్షత్రయుక్త కర్కాటక లగ్నంలో లక్ష్మణ, శత్రుఘ్నులు జన్మించారు. వారికి కులగురువు వశిష్ఠుడు నామకరణం జరిపించాడు.