ఆ రాజు తలే కొబ్బరికాయగా మారిందట..

మనం ఏ శుభకార్యం నిర్వహించినా.. పూజా కార్యక్రమాలేవి నిర్వహించినా కూడా కొబ్బరికాయను కొడుతుంటాం. ఇలా చేయడం చాలా మంచిదని భావన. అయితే కొన్ని సందర్భాల్లో మూడు కన్నులు ఉండే కొబ్బరికాయను వాడుతాం. కొబ్బరి కాయపై ఉండే మూడు కన్నులు త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులని హిందువులు నమ్ముతుంటారు. ఒకసారి శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవితో కలిసి భూమిపైకి వచ్చాడట. ఆ సమయంలో లక్ష్మీదేవి తనతో పాటు కొబ్బరిచెట్టును, కామధేనువును తీసుకొచ్చిందట. అందుకే కొబ్బరి అంత పవిత్రం అంటారు. ఇక దీని గురించి మరో కథ కూడా ఉంది.

అప్పట్లో భూమిపై మానవులను, జంతువులను బలిచ్చే ఆచారం ఉండేది. దీనిని ఆపడం కోసం కొబ్బరికాయను కొట్టడం ఆరంభించారట. పూర్వ కాలంలో సత్యవ్రత అనే రాజు రాజ్యంలో విశ్వామిత్రుల వారు నివసించేవారు. విశ్వామిత్రుడు తపస్సు చేయడానికి అడవులకు వెళ్లి చాలా కాలం పాటు తిరిగి రాలేదట. దీంతో విశ్వామిత్రుడి కుటుంబం ఆకలితో అడవి మొత్తం తిరుగుతుండగా సత్యవ్రతుడు చూశాడు. వెంటనే విశ్వామిత్ర కుటుంబాన్ని తన ఆస్థానానికి తీసుకొచ్చి వారికి ఆకలి సమస్యను తీర్చారట. విశ్వామిత్రుడు తిరిగి వచ్చిన అనంతరం అతని కుటుంబం సత్యవ్రతుడి గురించి చెప్పింది. సత్యవ్రతకు విశ్వామిత్రుడు కృతజ్ఞతలు తెలపగా.. తనకు ఒక వరం ఇవ్వమని అభ్యర్థించాడు. తనకు స్వర్గానికి వెళ్లాలనుందని చెప్పగా త్రిశంకు స్వర్గాన్ని సత్యవ్రతుడి కోసం విశ్వామిత్రుడు సృష్టించాడట. ఈ త్రిశంకు స్వర్గం భూమితో ఒక స్తంభం ద్వారా అనుసంధానించబడింది. అదే కొబ్బరి చెట్టుగా మారిందని.. రాజు తల కొబ్బరికాయగా మారిందని ప్రతీతి.

Share this post with your friends