ఛార్‌దామ్ యాత్రకు తాత్కాలిక బ్రేక్.. కారణమేంటంటే..

ఎన్నో ఆశలతో ఏడాది పాటు ఎదురు చూసి తీరా అక్కడకు చేరుకున్నాక యాత్రకు బ్రేక్ పడితే చాలా ఇబ్బందికరంగా అనిపిస్తుంది. భారీ వర్ణాల కారణంగా ఛార్‌దామ్ యాత్రకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. ఈ విషయాన్ని ఉత్తరాఖండ్ ప్రభుత్వం స్వయంగా ప్రకటించింది. మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురవనున్న నేపథ్యంలో బద్రీనాథ్, కేదార్‌నాథ్, యమునోత్రి మార్గాల్లో కొండ చరియలు విరిగిపడే అవకాశం ఉంది. ఈ క్రమంలోనే యాత్రను తాత్కాలింగా నిలిపివేశారు. కాబట్టి ఛార్‌దామ్ యాత్రికులు తమ ప్రయాణాన్ని మానుకోవాలని అధికారులు సూచించారు. బద్రీనాథ్ హైవేను కొండచరియలు విరిగిపడి.. చాలా చోట్ల రోడ్లకు గుంతలు ఏర్పడటంతో మూసివేశారు.

జోషిమఠ్‌‌లోని విష్ణుప్రయాగ్‌ దగ్గర అలకానంద ఉగ్రరూపాన్ని దాల్చడంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. భారీ వర్షాలపై సమీక్ష నిర్వహించిన ఉన్నతాధికారులు ఉత్తరాఖండ్‌లోని తొమ్మిది జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేశారు. అలాగే గర్వాల్ ప్రాంతంలోనూ రెండు రోజుల పాటు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో వాతావరణం అనుకూలించే వరకూ ఛార్‌దామ్ యాత్రను కొనసాగించలేమని అధికారులు వెల్లడించారు. పరిస్థితులు అనుకూలించిన తర్వాత యాత్ర పున:ప్రారంభమవుతుందని తెలిపారు.

Share this post with your friends