శ్రీరాముడికి అక్క ఉందనే విషయమే చాలా మందికి తెలియదు. అలాంటిది ఆ అక్కకు ఆలయం ఉందనే విషయం తెలియడం కష్టమే. శ్రీరాముడి కంటే ముందే దశరథ మహారాజు కౌసల్య దంపతులకు శాంతాదేవి జన్మించింది. ఆమె అంగవైకల్యంతో జన్మించింది. దీంతో మహర్షుల సలహా మేరకు ఆమెను దత్తత ఇచ్చారు. శాంతాదేవిని అంగదేశ రాజైన రోమాపాదుడికి దత్తత ఇచ్చారు. శాంతాదేవికి యుక్త వయసు వచ్చాక రుష్యశృంగ మహర్షితో వివాహమైంది. అయితే ఒకానొక సమయంలో అంగదేశంలో విపరీతమైన కరువొచ్చింది. అక్కడి ప్రజానీకం మొత్తం కరువు కారణంగా నానా ఇబ్బందులు పడింది.
ఆ సమయంలో రుష్యశృంగ మహర్షి యజ్ఞం చేసి ఆ ప్రాంతాన్ని కరువు నుంచి బయట పడేశారు. ఆ తర్వాత ఆ ప్రాంతం సుభిక్షంగా ఉంది. దీనికి సంబంధించిన వివరాలు మొత్తం వశిష్ట రామాయణం ఆదిపర్వంలో ఉన్నాయి. దానిలో వాల్మీకి శాంతాదేవికి సంబంధించిన విషయాలన్నింటినీ వివరించారు. ఇక శాంతాదేవికి గుడి ఎక్కడుందంటారా? హిమాచల్ ప్రదేశ్‌లోని కులు దగ్గర బంజారా ప్రాంతంలో రుష్యశృంగ మహర్షికి దేవాలయంలో రుష్యశృంగ మహర్షితో పాటుగా శాంతాదేవి విగ్రహం కూడా ఉంది. ధర్మపత్నిగా శాంతాదేవి కూడా అక్కడి ప్రజల నుంచి పూజలు అందుకుంటోంది.