శబరిమల అయ్యప్ప స్వామివారి మండల పూజా మహోత్సవాలు నవంబరు 15 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మహోత్సవాలు డిసెంబర్ 26 వరకూ జరగనున్నాయి. ఈ నేపథ్యంలో గత ఏడాది ఎదురైన చేదు అనుభావాలు తిరిగి పునరావృతం కాకుండా ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు(టీడీబీ) భక్తుల దర్శనాల విషయంలో కీలక నిర్ణయాలు తీసుకుంది. గత ఏడాది మాదిరిగా ఈసారి భక్తులకు స్పాట్ బుకింగ్స్ ఉండవని టీడీబీ తేల్చి చెప్పింది. గత ఏడాది స్పాట్, ఆన్‌లైన్ బుకింగ్స్ రెండింటినీ అనుమతించడం వలన ప్రతిరోజూ సగటున లక్షన్నర మందికి పైగా శబరిమలకు వచ్చారు.
వారందరికీ సరిపోయే రీతిలో క్యూలైన్లు, దర్శనం కౌంటర్లు, రవాణా సౌకర్యాలు ఏర్పాటు చేయలేకపోయింది. ఈ నేపథ్యంలో టీడీబీ ఈ ఏడాది స్పాట్ బుకింగ్స్‌ను నిలిపివేసింది. ఆన్‌లైన్‌లో మాత్రమే భక్తులు బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. బుకింగ్ చేసుకున్న వారందరికీ 48 గంటల గ్రేస్ టైం ఇస్తుంది. ఆ టైమ్‌ను వాడుకుని దర్శనం చేసుకోవచ్చు. రోజుకు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ చేసుకున్న వారిని రోజుకు 80 వేల మంది చొప్పున దర్శనానికి అనుమతిస్తారు. అలాగే ఈసారి దర్శన వేళలను సైతం మార్పు చేశారు. వేకువజామున 3 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకూ.. తిరిగి మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకూ కొనసాగుతాయి.ఈ మార్పు వల్ల అయ్యప్ప దర్శనాలకు రోజూ 17 గంటల పాటు సమయం లభిస్తుంది. డిసెంబర్ 26 వరకూ మండల పూజా మహోత్సవాలు.. డిసెంబర్ 30 వకూ మకరు విళక్కు పూజల కోసం ఆలయాన్ని తెరిచి ఉంచుతారు. జనవరి 14న మకర జ్యోతి దర్శనం ఉంటుంది.