తమిళనాడులోని కుంభకోణం సమీపంలో ఉన్న సూర్యనార్ కోవిల్‌లో ప్రధానమైన సూర్యదేవుడు తన ఇద్దరు భార్యలు ఉషాదేవి, ప్రత్యూషదేవిలతో కలిసి భక్తులకు దర్శనమిస్తుంటాడు. ఈ ఆలయంలో నవగ్రహాలకు ప్రత్యేకమైన ఆలయాలున్నాయి. సూర్యదేవుడంటే తీక్షణమైన కిరణాలు కలిగినవాడు. కానీ ఇక్కడ సూర్య భగవానుడు ప్రసన్నవదనంతో దర్శనమిస్తాడు. రెండు చేతుల్లో తామర పుష్పాలు కలిగి భక్తకోటికి ఆశీర్వచనాలు ప్రసాదిస్తున్న ముద్రలో భక్తులను అనుగ్రహిస్తుంటాడు. సూర్యదేవుని మందిరానికి ఎదురుగానే బృహస్పతి మందిరం ఉంటుంది. నవగ్రహాలకు వాటి వాహనాలు ఇక్కడ కనిపించకపోవడం గమనార్హం.
ఇక ఇక్కడ ప్రతి ఏటా తమిళమాసమైన తాయ్ నెలలో జరిగే రథ సప్తమి వేడుకలను వైభవంగా నిర్వహిస్తారు. తాయ్ మాసం ఎప్పుడో కాదు.. జనవరి-ఫిబ్రవరిలో ఉంటుంది. ఇక్కడ పది రోజుల పాటు అత్యంత వైభవంగా రథసప్తమి వేడుకలు జరుగతాయి. సూర్యభగవానుడికి జరిగే మహాభిషేకానికి విశేషసంఖ్యలో భక్తులు హాజరవుతారు. ముఖ్యంగా ఇక్కడకు గ్రహ బాధల నుంచి విముక్తి పొందేందుకు భక్తులు వస్తుంటారు. గ్రహబాధలు ఎక్కువగా వున్న వారు 12 ఆదివారాలు ఆలయంలోనే బసచేసి సాంత్వన కలిగించమని భగవంతుడిని వేడుకుంటారు. ఇక్కడ తులాభారం కూడా జరుగుతుంటుంది. దీనిలో భాగంగా తమ బరువుకు సమానమైన గోధుమ, బెల్లం… తదితర వ్యవసాయ ఉత్పత్తులను, చక్కర పొంగలి ప్రసాదాన్ని ఆలయానికి ఇస్తుంటారు.