నంద్యాల జిల్లా శ్రీశైలం శ్రీ మల్లికార్జున స్వామివారిని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలి వచ్చారు. రూ.300 టికెట్ తీసుకుని క్యూలైన్‌లో స్వామివారి దర్శనం కోసం భక్తులు వేచి ఉన్నారు. సడెన్‌గా తమ ముందు పై నుంచి ఏదో కిందపడింది. ఒక్కసారిగా పెద్ద శబ్దం రావడంతో ఆందోళనకు గురైన భక్తులు అందరూ అదేంటో చూసి ముందు షాక్ అయ్యారు. ఆ తరువాత చాలా సంతోషం వ్యక్తం చేశారు. ఇంతకీ అదేంటంటే.. పునుగు పిల్లి. భక్తులను చూసిన పునుగు పిల్లి సైతం భయపడిపోయి పరుగు అందుకుంది.
సాధారణంగా పునుగుపిల్లి బయట ఎక్కడైనా కనిపించడం చాలా అరుదు. దాదాపు ఎవరూ బయట చూసి ఉండరు. దీంతో అది పునుగు పిల్లి అని తెలిసి వింతగా చూశారు. క్యూలైన్లలో పునుగుపిల్లి అటుఇటు తిరుగుతూ ఎటు పోవాలో అర్ధంగాకా క్యూలైన్లలోని జాలిలోనుంచి తప్పించుకునే ప్రయత్నం చేసింది. కానీ దాని వల్ల కాలేదు. చివరకు సెక్యూరిటీ సిబ్బంది పునుగుపిల్లిని పట్టుకుని బయట వదిలేశారు. సాధారణంగా పునుగుపిల్లులు అడవులలో నీటి వడ్డున సంచరిస్తుంటాయి. కాబట్టి బయట ఎక్కడైనా వాటిని చూడటం చాలా అరుదు. అలాంటిది క్యూలైన్‌లో తమ ముందే ప్రత్యక్షం కావడంతో భక్తులు సంభ్రమాశ్చర్యాలకు గురయ్యారు.