వైకుంఠ ఏకాదశికి సర్వదర్శనం స్లాటెడ్ టోకెన్ల జారీకి పటిష్ట చర్యలు

వైకుంఠ ఏకాదశి నేపథ్యంలో భక్తులు శ్రీవారి దర్శించుకునేందుకు వీలుగా జారీ చేయనున్న సర్వదర్శనం టోకెన్ల కేంద్రాలలో పటిష్ట ఏర్పాట్లు చేపట్టాలని అధికారులకు తిరుపతి జేఈవో శ్రీమతి ఎం. గౌతమి సూచించారు. తిరుపతి పరిపాలన భవనంలో శుక్రవారం అధికారులతో ఆమె సమీక్ష నిర్వహించారు. టిటిడి ఈవో శ్రీ జె.శ్యామలరావు ఆదేశాల మేరకు టిటిడి అధికారులు సమన్వయంతో ఏర్పాట్లు చేయాలని శాఖల వారీగా ఆమె సూచించారు. 2025 జనవరి 10 నుండి 19వ తేదీ వరకు 10 రోజుల పాటు వైకుంఠ ఏకాదశి దర్శనాల కోసం టోకెన్లు జారీకి ఏర్పాట్లు చేస్తున్నసౌకర్యాలలో అలసత్వం వహించరాదన్నారు. తిరుపతిలో ఇందిరా మైదానం, రామచంద్ర పుష్కరిణి, శ్రీనివాసం కాంప్లెక్స్‌, విష్ణునివాసం కాంప్లెక్స్‌, భూదేవి కాంప్లెక్స్‌, భైరాగిపట్టెడలోని రామానాయుడు ఉన్నత పాఠశాల, ఎంఆర్‌ పల్లిలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల, జీవకోనలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల, అదేవిధంగా తిరుమల స్థానికుల కొరకు తిరుమల బాలాజీ నగర్‌ కమ్యూనిటీ హాల్‌లోని కౌంటర్లలో భక్తులకు అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలన్నారు.

టిటిడి ఇంజనీరింగ్, విజిలెన్స్, సాంకేతిక సిబ్బంది, పోలీసులు సమన్వయంతో పనిచేసి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా టోకెన్లు జారీ చేయాలన్నారు. ఈసారి భక్తులకు ఫోటోతో కూడిన స్లిప్ లను జారీ చేయనున్న తరుణంలో ఆధార్ కార్డులను క్రోడీకరించే సమయంలో సాంకేతిక సమస్యలు రాకుండా ఐటీ విభాగం మరింత అప్రమత్తంగా ఉండాలన్నారు. జనవరి 10, 11, 12 తేదీలకు సంబంధించి జనవరి 9వ తేదీన ఉదయం 5 గం.ల నుండి 1.20 లక్షల టోకెన్లు జారీ చేసేలా ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు. తిరుపతిలోని 8 కేంద్రాలలో 90 కౌంటర్లు, తిరుమలలో 4 కౌంటర్లు కలుపుకుని మొత్తం 94 కౌంటర్లలో టోకెన్లు మంజూరు చేస్తున్న నేపథ్యంలో టిటిడిలోని సంబంధిత విభాగాలు సమిష్టిగా పనిచేయాలన్నారు. అదేవిధంగా తదుపరి మిగిలిన రోజులకు (13 నుండి 19వ తేదీ వరకు) ఏరోజుకారోజు ముందు రోజు టోకెన్లను తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్‌, శ్రీనివాసం, విష్ణు నివాసంలలో మాత్రమే టోకెన్లు జారీ చేసేందుకు వీలుగా ఏర్పాట్లు చేయాలని సూచించారు. భక్తుల సౌకర్యార్థం క్యూలైన్లు, బారీకేడ్లు, షెడ్లు, భద్రత, తాగునీరు, మరుగుదొడ్లు తదితర పనులను సకాలంలో పూర్తి చేయాలన్నారు.

Share this post with your friends