నేడు భద్రాద్రిలో వైభవంగా శ్రీరామ పట్టాభిషేకం

శ్రీరామనవమి అనగానే మనకు గుర్తొచ్చేది భద్రాద్రి. ఇక్కడ సీతారాముల కల్యాణం వీక్షించేందుకు దేశం నలుమూలల నుంచి భక్తులు వస్తుంటారు. శ్రీరామనవమి వస్తుందంటేనే భద్రాద్రి ప్రత్యేక శోభను సంతరించుకుంటుంది. నిన్న సీతారాముల కల్యాణం వైభవంగా ముగిసింది. అశేష భక్త జన సందోహం నడుమ స్వామివారి వివాహం కన్నుల పండువగా జరిగింది. ఇక నేడు శ్రీరామ పట్టాభిషేక మహోత్సవం జరగనుంది. మిథిలా కల్యాణ మండపంలో ఉదయం 10.30 గంటల నుంచి 12.30 వరకూ పట్టాభిషేక మహోత్సవం అంగరంగ వైభవంగా భద్రాద్రిలో జరగనుంది.

శ్రీరాముడు 14 ఏళ్ల వనవాసానంతరం అయోధ్యకు వచ్చి పట్టాభిషిక్తుడయ్యాడు. దీనికోసం భద్రాద్రిలో అన్ని ఏర్పాట్లూ పూర్తయ్యాయి. ఇక స్వామివారి కల్యాణం, పట్టాభిషేకం వంటి కార్యక్రమాల నేపథ్యంలో భద్రాద్రి మొత్తం భక్తిభావంతో మునిగి తేలుతోంది. శ్రీరాముడు సింహాసనం అధిష్టించాక ఆ రాజ్యంలో దొంగల భయం కానీ.. ప్రజలకు ఎలాంటి అనారోగ్య సమస్యలు కానీ లేవు. ప్రజలు రాగ, ద్వేషాలకు అతీతంగా జీవించారట. మనిషి మనుగడకు ప్రశాంతమైన వాతావారణం రామ రాజ్యంలో ఉండేవట. అందుకే సర్వాజనామోదం పొందిన కోదండ రాముడిని నేటికీ ఆదర్శంగా తీసుకుంటూ ఉంటారు.

Share this post with your friends