వేదమంత్రోచ్ఛారణల నడుమ సింహాసనం అధిష్టించిన రామయ్య.. పులకించిన భద్రగిరి..

సీతారాముల కల్యాణం అనంతరం అంతటి వేడుక శ్రీరామ పట్టాభిషేకం. నేడు భద్రాద్రి యావత్తు రామయ్య పట్టాభిషేకం చూసి పులకించిపోయింది. ఇక ఆ రామయ్య తండ్రి వేద మంత్రోచ్ఛారణల నడుమ సింహాసనాన్ని అధిష్టించారు. నేటి ఉదయం నుంచే మాడవీధులన్నీ హడావుడిగా మారిపోయాయి. శ్రీరామ నామస్మరణల మధ్య ప్రధానాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కల్యాణ మూర్తులను భక్తజన సందోహం నడుమ మిథిలా స్టేడియానికి తీసుకొచ్చారు. ఆ సమయంలో మాఢవీధులన్నీ శ్రీరామ నామ జపంతో మరుమోగాయి.

శ్రీరామరాజ్యంలో ప్రజలు ఎంత సంతోషంగా ఉన్నారో.. రాజ్యం సుఖశాంతులతో ఎలా వర్ధిల్లిందో వైదిక పెద్దలు భక్తులకు వివరించారు. అనంతరం గోదావరి నుంచి తీసుకొచ్చిన పుణ్య జలాలను భక్తులపై చల్లి ఆశీస్సులు అందించారు. సీతమ్మ తల్లితో కలిసి పట్టాభిషిక్తుడైన స్వామివారిని చూసేందుకు భక్తులకు రెండు కళ్లూ చాలలేదు. ఖడ్గం చేతబట్టి కిరీటాన్ని ధరించిన రామయ్య తండ్రి తన చల్లని ఆశీస్సులను భక్తులకు అందిస్తున్నట్టుగా కనిపించాడు. అలా ఆనందోత్సాహాల నడుమ శ్రీరామ పట్టాభిషేక కార్యక్రమం ముగిసింది.

Share this post with your friends