కార్వేటినగరం శ్రీ వేణుగోపాలస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. నేటి ఉదయం స్వామివారు సింహ వాహనంపై దర్శనమిచ్చారు. ఇవాళ సాయంత్రం ముత్యపు పందిరి వాహనంపై దర్శనమివ్వనున్నారు. కాగా.. నిన్న ఉదయం చిన్నశేష వాహనంపై శ్రీ వేణుగోపాలస్వామి చిన్నశేష వాహనంపై విహరించి భక్తులకు దర్శనమిచ్చారు.మంగళవాయిద్యాలు, భజనలు, కోలాటాల నడుమ ఆలయ మాడ వీధుల్లో కోలాహలంగా వాహనసేవ జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూర హారతుల సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.
నిన్న సాయంత్రం హంస వాహనంపై స్వామివారు భక్తులను కటాక్షించారు. కార్వేటినగరం శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాలస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు బుధవారం ఉదయం 10.30 నుంచి 11 గంటల మధ్య కర్కాటక లగ్నంలో వైభవంగా ప్రారంభమయ్యాయి. వేదపండితుల మంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాలు, భక్తుల గోవిందనామస్మరణ నడుమ గరుడ చిత్రంతో కూడిన ధ్వజపటాన్ని ధ్వజస్తంభంపై ప్రతిష్ఠించారు. అనంతరం ఆస్థానం ఘనంగా జరిగింది. జూన్ 7వ తేదీన మధ్యాహ్నం 1.30 నుంచి 3.30 గంటల వరకు పుష్పయాగం నిర్వహించనున్నారు.