ప్రారంభమైన శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు.. మొదటిసారిగా ‘తెప్పకోలం’ అలంకరణ..

శ్రీపద్మావతి పరిణయోత్సవ మండపాన్ని వివిధ రుచుల ఫలాలు, సువాసనలు వెదజల్లే రంగురంగుల పుష్పాలతో అలంకరించారు. తిరుమలలోని నారాయణగిరి ఉద్యానవనంలో అలంకరించిన ఈ మండపంలో ఇవాళ్టి నుంచి శ్రీపద్మావతి పరిణయోత్సవాలు శోభాయమానంగా ప్రారంభమయ్యాయి. మే 19వ తేదీ వరకు ఈ ఉత్సవాలు అత్యంత వైభ‌వంగా నిర్వహించ‌నున్నారు. శ్రీ పద్మావతి పరిణయోత్సవ మండపం అలంకరణలకు పెట్టింది పేరు. గతంలో పసుపు-కుంకుమ‌ మండపం, గాజుల మండపం, రంగురాళ్ల మండపం, అష్ట‌ల‌క్ష్మీ మండ‌పం, ద‌శ‌వ‌తార మండ‌పం వంటి నమూనాలతో భ‌క్తుల‌ను విశేషంగా ఆక‌ట్టుకునేలా టీటీడీ ఉద్యానవన విభాగం అలంకరణ చేపట్టింది.

ఈ ఏడాది మొట్ట మొద‌టి సారిగా కేర‌ళ సాంప్రదాయం “తెప్ప కోలం ” అలంక‌ర‌ణతో పాటు ఫలపుష్పాలతో, విద్యుద్దీపాలతో భక్తులను ఆకట్టుకునేలా అలంకరించారు. ఇందులో రోజా, లిల్లీ, చామంతి వంటి రెండు ట‌న్నుల సంప్రదాయ పుష్పాలు, 50 వేల క‌ట్ ఫ్లవర్స్ (15 ర‌కాలు), వివిధ ర‌కాల‌ ఫ‌లాలు, ఏనుగులు, గుర్రాలు, చిన్నికృష్ణుడు వంటి సెట్టింగుల‌తో సర్వాంగ సుందరంగా అలంకరించారు. మండపం పైభాగంలో ఏర్పాటుచేసిన వెన్న ఉట్లు, వెండి గంటలు, పూల గుత్తులు ఆకట్టుకుంటున్నాయి. టీటీడీ గార్డెన్‌ విభాగం డెప్యూటీ డైరెక్టర్ శ్రీ శ్రీ‌నివాసులు ప‌ర్యవేక్షణ‌లో బెంగుళూరుకు చెందిన 150 మంది నిపుణులైన అలంక‌ర‌ణ సిబ్బంది, టీటీడీ గార్డెన్ విభాగంకు చెందిన మ‌రో 50 మంది సిబ్బంది గ‌త వారం రోజులుగా శ్రీ ప‌ద్మావ‌తి ప‌రిణ‌యోత్సవాల మండ‌పాన్ని రూపొందించారు.

Share this post with your friends