
శ్రీ మహావిష్ణువు కిరీటం పాదరక్షలను ఎంతలా అవమానించిందో తెలుసుకున్నాం కదా. అయినా సరే.. పాదరక్షలు కిరీటంతో ఎలాంటి వాదనకూ దిగకుండా మనసులోనే బాధపడి మౌనంగా ఉంది. ఆ తరువాత ఒకరోజు విష్ణుమూర్తి తన పాదరక్షలను ధరించి బయటకు వెళ్లిన సమయంలో స్వామివారి వద్ద పాదరక్షలు తమ బాధను వెళ్లగక్కాయి. పాదరక్షల ఆవేదనను విన్న విష్ణుమూర్తి.. ‘‘నాకు రక్షణగా నిలుస్తున్న మీరెందుకు బాధపడతున్నారు? నేనెప్పుడూ మిమ్మల్ని తక్కువగానో.. అవహేళనగానో చూడలేదే.. కిరీటం మాటలకు బాధపడుతున్నారా?’’ అని అడిగాడు.
అప్పుడు పాదరక్షలు తమను కిరీటం ఎంతలా అవహేళన చేసిందో వివరించి చెప్పాయి. అదంతా విన్న విష్ణుమూర్తి.. కిరీటం మాటలను అస్సలు పట్టించుకోవద్దని.. మరచిపోయి ఆనందంగా ఉండాలని సూచించాడు. అంతేకాదు.. తాను త్రేతాయుగంలో రామావతారంలో జన్మిస్తానని.. ఆ సమయంలో పద్నాలుగేళ్ల పాటు పాదుకలను సింహాసనంపై ఉంచి రాజ్య పాలన చేయిస్తానని మాటిచ్చాడు. అందుకే విష్ణుమూర్తి మాట ప్రకారం త్రేతాయుగంలో రాముడు పద్నాలుగేళ్ల పాటు అరణ్యవాసం చేసిన సమయంలో రాముల వారి పాదాలను భరతుడు తలపై పెట్టుకుని మరీ తీసుకెళ్లి పాదుకా పట్టాబిషేకం చేసి పరిపాలన గావించాడు.
