వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఆలయాలన్నీ అందంగా అలంకరించబడ్డాయి. వైష్ణవాలయాలకు భక్తులు పెద్ద ఎత్తున పోటెత్తారు. కృష్ణా జిల్లా, కృత్తువెన్ను మండలం, లక్ష్మీ పురం గ్రామంలో కొలువై ఉన్న శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరస్వామి వైకుంఠ ఏకాదశి సందర్భంగా నవనీత అలంకారంలో దర్శనం ఇచ్చారు. దాతల సహకారంతో 23 కేజీల వెన్నపూస, 6 కేజీల డ్రై ఫ్రూట్స్‌తో స్వామివారికి ఆలయ అర్చకులు అందంగా అలంకారం చేశారు. స్వామిని దర్శించుకోవడానికి గ్రామస్తులతోపాటు ఇరుగుపొరుగు గ్రామస్తులు విరివిగా తరలివచ్చారు.
ఇక సాయంత్రం స్వామి పల్లకి ఉత్సవం, పవళింపు సేవ జరిగింది. 2015లో ఈ ఆలయ నిర్మాణం జరిగింది. అప్పటి నుంచి ఇక్కడి వేంకటేశ్వర స్వామికి నిత్య పూజలు, కైంకర్యాలు ఆలయ అర్చకులు నిర్వహిస్తున్నారు. కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా ఈ స్వామివారు మారడంతో చుట్టుపక్కల ప్రాంతాల నుంచి సైతం ఆలయానికి భక్తులు నిత్యం వస్తుంటారు. ప్రత్యేక దినాల్లో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ ఉంటారు.