ప‌ల్ల‌కీపై మోహినీ అలంకారంలో శ్రీ అల‌మేలుమంగ‌

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు ఐదవ రోజు వైభవంగా జరిగాయి. పెద్ద ఎత్తున భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. సోమవారం ఉదయం అమ్మవారు మోహినీ అలంకారంలో ప‌ల్ల‌కీలో ఊరేగుతూ భక్తులను అనుగ్ర‌హించారు. అమ్మవారి మోహినీ అవతారం భౌతికంగా జగన్మోహకత్వాన్నీ, ఆధ్యాత్మికంగా మాయాతీతశుద్ధ సాక్షాత్కారాన్ని ఏక సమయంలోనే సిద్ధింపజేస్తోంది. ఉదయం 11.30 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు శ్రీ కృష్ణస్వామి మండపంలో అమ్మవారికి శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించనున్నారు. ఇందులో పసుపు, చందనం, పాలు, పెరుగు, తేనె, పన్నీరు, వివిధ రకాల ఫలాలతో అభిషేకం చేస్తారు. మధ్యాహ్నం 3.30 నుండి సాయంత్రం 5 గంట‌ల వ‌ర‌కు వ‌సంతోత్స‌వం నిర్వ‌హిస్తారు.

పద్మావతి అమ్మవారికి గొడుగుల సమర్పణ..

తమిళనాడులోని తిరునిన్రవూరుకు చెందిన శ్రీమద్ రామానుజ కైంకర్య ట్రస్టు ప్ర‌తినిధులు రెండు గొడుగులను కానుకగా అందించారు. ఈ గొడుగులను ఆలయం వద్ద టిటిడి చైర్మన్ శ్రీ బీ ఆర్ నాయుడుకు అందించారు. బ్రహ్మోత్సవాల్లో గజ‌ వాహనం రోజున ఈ ట్ర‌స్టు త‌ర‌ఫున‌ గొడుగులు స‌మ‌ర్పించ‌డం ఆన‌వాయితీగా వ‌స్తోంది. చెన్నైకి చెందిన హిందూ ధర్మార్థ సమితి అర్గనైజింగ్‌ కార్యదర్శి శ్రీ ఆర్‌ఆర్‌.గోపాల్‌జి ఆధ్వర్యంలో 5 గొడుగులను తీసుకొచ్చారు. ఆలయం ఎదుట జరిగిన కార్యక్రమంలో ఈ గొడుగులను ఆలయ డిప్యూటీ ఈవో శ్రీ గోవింద రాజన్ కు అందించారు.

Share this post with your friends