శ్రావణ మాసం వచ్చిందంటే చాలు.. పెళ్లిళ్లే కాదు.. గృహ ప్రవేశాల వంటివి కూడా అవుతుంటాయి. ప్రతి ఒక్కరూ సొంతిల్లు కావాలని అనుకుంటారు. ఈ క్రమంలోనే పైసా పైసా కూడబెట్టి చిన్నదో పెద్దదో ఇల్లు కట్టుకుంటారు. మూడు నెలలుగా ముహూర్తాలు లేవు కాబట్టి శ్రావణ మాసంలో గృహ ప్రవేశానికి ఇల్లు కట్టుకున్న వారంతా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అయితే ఈ మాసంలో గృహ ప్రవేశాలకు బలమైన ముహూర్తాలు లేవనేది కొందరు పండితుల వాదన. ఎంతో కష్టపడి నిర్మించుకున్న ఇంట్లోకి చేరడానికి ముహూర్తం బలం కూడా చాలా అవసరమని అంటున్నారు.
ఆగస్టు నెలలో గృహ ప్రవేశం చేయడానికి మంచి మూహూర్తం అయితే లేదట. అయినా సరే.. గృహ ప్రవేశం చేస్తే మాత్రం కొన్ని ఇబ్బందులు అయితే తప్పవని అంటున్నారు. కాబట్టి ఇప్పడు గృహ ప్రవేశం చేయడం కంటే.. దానిని వాయిదా వేసుకుని అక్టోబర్, నవంబర్నెలల్లో గృహ ప్రవేశం చేయడం చాలా మంచిదని అంటారు. తప్పనిసరి పరిస్థితుల్లో గృహ ప్రవేశం చేయాలి అనుకుంటే మాత్రం కొన్ని ముహూర్తాలు ఉన్నాయని అంటున్నారు. మొత్తానికి వివాహాలకైతే ఈ శ్రావణ మాసం భేషుగ్గానే ఉంది కానీ గృహ ప్రవేశాలకు మాత్రం ఆశించిన స్థాయిలో అనుకూలంగా లేదని పండితులు చెబుతున్నారు.