జాపాలి తీర్థంలో హనుమ జయంతి సందర్భంగా విశేష పూజలు

ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలోని జాపాలి తీర్థంలో హనుమత్ జయంతి వేడుక అంగరంగ వైభవంగా జరుగుతుంది. ప్రకృతి ఒడిలో ఈ ఆలయం అత్యంత రమ్యంగా ఉంటుంది. రామగుండం, సీత గుండం, భృగువు మహర్షి తీర్థాల నడుమ జాపాలి తీర్థం ఉంటుంది. శ్రీవారి ఆలయానికి ఉత్తరాన 5 కిలో మీటర్ల దూరంలో కొలువై ఉంటుంది. ఈ స్వామివారు శ్రీవారి కోసం తిరుమలలో వెలిశాడని చెబుతుంటారు. చుట్టూ కొండలు, ఎత్తైన జలపాతాల నడుమ ఈ ఆలయం ఉంటుంది. అలాగే తిరుమలలోని ఆకాశగంగ వద్ద శ్రీ బాలాంజనేయస్వామివారి ఆలయం ఉంది. ఈ ఆలయంలో హనుమత్ జయంతి వేడుకలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నెల 5వ తేదీ వరకూ కొనసాగనున్నాయి.

ఆకాశ గంగలో శ్రీ బాలాంజనేయ స్వామి వారితో పాటు శ్రీ అంజనాదేవికి ప్రత్యేక అభిషేకాలు జరుగుతాయి. మొదటి రోజున మల్లెపూలతో అంజనాదేవి, బాలాంజనేయ స్వామివారిని అభిషేకిస్తారు. ఇక రెండవ రోజున తమలపాకులు, మూడవ రోజున ఎర్ర గన్నేరు, కనకాంబరం, నాలుగవ రోజున చామంతి పూలతోఅభిషేకం నిర్వహిస్తారు. ఇక చివరి రోజైన ఐదవరోజు స్వామివారికి అత్యంత ఇష్టమైన సింధూరంతో అభిషేకం నిర్వహిస్తారు. ఈ ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. ఈ ఐదు రోజుల పాటు సామూహిక హనుమాన్ చాలీసా పారాయణ, సుందరకాండ పారాయణం విశేషంగా జరుగుతాయి.

Share this post with your friends