నిన్న రామయ్య.. నేడు సీతమ్మ.. ఈ ఆలయ విశేషాలు అన్నీ ఇన్నీ కావు..

రామ జన్మభూమి అయిన అయోధ్యలో ఎట్టకేలకు బాలరాముడు కొలువు దీరాడు. ఈ ఏడాది జనవరి 22న గర్భగుడిలో బాల రాముడి ప్రతిష్ట జరిగింది. ఇప్పుడు సీతాదేవి ఆలయం వంతు వచ్చేసింది. అది అయోధ్యలో కాదండోయ్.. శ్రీలంకలో.. అక్కడ సీతా ఎలియా గ్రామంలో సీతా దేవి ఆలయాన్ని ఆర్ట్ ఆఫ్ లివింగ్‌కు చెందిన శ్రీ రవిశంకర్ గురూజీ పునరుద్ధరించారు. ఈ ఆలయం మే 19న ప్రారంభించున్న నేపథ్యంలో ఆంజనేయుడి జన్మస్థలమైన అంజనాద్రి కొండ నుంచి సీతాదేవికి భారీగా కానుకలు పంపించారు. ఆంజనేయ విగ్రహంతో పాటు నీరు, మట్టి, పట్టు చీర కానుకలుగా వెళ్లాయి.

ప్రస్తుతం సీతాదేవి ఆలయం నిర్మించిన చోటే పురాణ కాలంలో రావణాసురుడు ఆమెను బంధించాడని చెబుతారు. దానిని అశోక వాటిక అని పిలుస్తారు. ఈ ఆలయంలో రాముడు, సీతాదేవి, లక్ష్మణుడు, హనుమంతుడి విగ్రహాలున్నాయి. ఇక ఈ ఆలయ విశేషాలు అన్నీ ఇన్నీ కావు. అవేంటంటే.. ఇక్కడ హనుమంతుని పాదముద్రలున్న శిల కూడా ఉంది. ఇంకో ఆసక్తికర విషయం ఏంటంటే.. ఆలయం పక్కనే ఒక నది ఉంది. ఆ నదిలో ఇప్పటికీ సీతాదేవి స్నానం చేస్తుందని నమ్ముతారు. మరో విశేషం ఏంటంటే.. ప్రపంచంలోనే ప్రత్యేకంగా సీతమ్మ కోసం అంకితం చేయబడిన ఏకైక ఆలయం ఇదే. శ్రీలంకలో ఉన్న రామాయణానికి సంబంధించిన అత్యంత ముఖ్యమైన ప్రదేశం కూడా ఇదే.

Share this post with your friends