అప్పటి నుంచే శ్రీవారి ప్రసాదాల కోసం అందుబాటులోకి మన్రో గంగాళాలు

తిరుమల శ్రీవారి ప్రసాదాలను భక్తులు చేతితో తినడం చూసి బ్రిటిష్ ప్రభుత్వం వారి ఈస్ట్ ఇండియా కంపెనీలో గవర్నర్‌గా పని చేసిన థామస్ మన్రోకి అసహ్యం వేసింది. దీంతో ఆయన ప్రసాదాలను కడుపునొప్పిని సాకుగా చూపించి భక్తులు తినకుండా ఆదేశాలు జారీ చేశాడు. ఆ తరువాత ఏం జరిగిందో తెలుసుకుందాం. శ్రీ వేంకటేశ్వర స్వామివారి లీల ప్రభావంతో ఏ కడుపునొప్పిని సాకుగా చూపించి ప్రసాదాలు థామస్ మన్రో రద్దు చేశారో… అదే తీవ్రమైన కడుపు నొప్పి ఆయనకి వచ్చి ఎన్ని రకాలుగా వైద్యం చేయించినా తగ్గకుండా ఆతని ఆరోగ్యం క్షీణించి, పూర్తిగా అనారోగ్యంతో మంచం పట్టినాడు. అనుకోని పరిస్థితుల్లో అతనికి మంత్రాలయం రాఘవేంద్రస్వామి వారి మీద ఎనలేని భక్తి, శ్రద్ధ గురి కుదిరింది. అతను ఆ ఆలయానికి ఎన్నో కైంకర్యాలకు ధన సహాయం చేసినా ఆయన కడుపు నొప్పి మాత్రం తగ్గక నరక యాతన అనుభవించేవాడు.

అతనిలో వచ్చిన ఆధ్యాత్మిక పరివర్తనకి, సనాతన ధర్మం పట్ల భక్తిని గమనించిన మంత్రాలయ పీఠాధిపతులు ఆయన తిరుమల శ్రీవారి పట్ల, ఆయన ప్రసాదాల పట్ల చేసిన ఘోరమైన తప్పుని తెలియజేసి, శ్రీ మలయప్ప స్వామివారి క్షేత్ర మహిమని వివరించారు. శ్రీవారి ప్రసాదాల మహిమ తెలుసుకున్న థామస్ మన్రో… శ్రీవారి పులిహార నేరుగా తన చేతితో తిన్న వెంటనే కడుపునొప్పి మటుమాయం అయింది. తప్పు తెలుసుకున్న థామస్ మన్రో… శ్రీవారికి కైంకర్యాల కోసం, నైవేద్యాలు సమర్పణ కోసం చాలా గంగాళాలు సమర్పించాడు. తిరుపతి శ్రీవారి భక్తులకు మళ్ళీ మునుపటి లాగా ప్రసాదాలు పంచి పెట్టేలా వాటిని భక్తులు నేరుగా ఆలయం దగ్గరే తినేలా తిరిగి ఉత్తర్వులు ఇచ్చాడు. ఎంత పశ్చాత్తాప పడినా, ఎన్ని గంగాళాలు దేవస్థానానికి సమర్పించినా శ్రీవారి దర్శనానికి మాత్రం నోచుకోలేకపోయాడు. మనోవ్యధతో మంచం పట్టి “నేరుగా నీ సేవలో పాల్గొనే అదృష్టం లేదా స్వామీ” అని ఎన్నో విధాల శ్రీవారిని ప్రార్థిస్తూ 1827లో ప్రాణం వదిలాడు. అతని భక్తికి మెచ్చిన శ్రీనివాసుడు ఆనాటి నుండి ఈనాటి వరకు తన అన్ని రకాల ప్రసాదాలను కేవలం ఆ గంగాళాలులోనే స్వీకరిస్తున్నాడు. ఈ గంగాళాలు ఇప్పటికీ ‘మన్రో గంగాళాలు’ అనే పేరుతో దేవస్థాన పూజా కైంకర్యాలలో చలామణీలో ఉన్నాయి.

Share this post with your friends