దక్షిణ అయోధ్యగా విరాజిల్లుతున్న భద్రాచల శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కల్యాణ మహోత్సవం రేపు జరగనుంది. ఈ వివాహ మహోత్సవంలో తలంబ్రాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ప్రతి ఏడాది భద్రాచలంలో జరిగే నవమి కల్యాణ మహోత్సవాలకు తూర్పు గోదావరి జిల్లా వాసులు గోటి తలంబ్రాలను సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. ఈసారి మాత్రం ఎక్కువగా ఈతలంబ్రాల విషయంలో బాపట్ల జిల్లా పేరు బాగా వినిపిస్తోంది. ఇప్పుడు స్వామివారి కల్యాణం కోసం వరిపంటను సైతం ప్రత్యేకంగా సాగు చేయడం విశేషం. ఇక స్వామివారి తలంబ్రాల కోసం వడ్లను గోటితో వలుస్తారు. అసలు స్వామివారి తలంబ్రాలకు ఎందుకంత ప్రాధాన్యత?
ఎందుకు.. స్వామివారి తలంబ్రాలను ఎందుకు గోటితో వలుస్తారు? అంటే ఇది ఈనాటి సంప్రదాయం కాదు.. ఎప్పటి నుంచో వస్తోంది. అంటే అప్పటి తానీషా కాలం నుంచి అన్నమాట. అప్పట్లో గోటితో వలిచిన తలంబ్రాలను స్వామివారి కల్యాణానికి పంపించేవారట. అదే సంప్రదాయాన్ని ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. అయితే గత 11 సంవత్సరాలుగా బాపట్ల జిల్లా చీరాలలోని రఘురామ భక్త సేవా సమితి ఆధ్వర్యంలో కూడా తలంబ్రాలను సిద్ధం చేస్తూ వస్తున్నారు. కోటి గోటి తలంబ్రాలను వలిచి స్వామివారి కల్యాణ మహోత్సవానికి అందిస్తున్నారు. పైగా తలంబ్రాలలో కలిసే పసుపును సైతం రోటిలో దంచి మరీ పంపిస్తారు.