వారణాసి జిల్లా మదన్‌పురాలో ఉన్న సిద్ధీశ్వర మహాదేవ ఆలయం 70 ఏళ్ల తర్వాత తెరుచుకుంది. భారీ పోలీస్ బలగాల సమక్షంలో ఆలయ ద్వారాలు తెరిచి శుద్దిని ప్రారంభించారు. బుధవారం మధ్యాహ్నం వారణాసి ఏడీఎం సిటీ అలోక్ వర్మ సిద్ధీశ్వర మహాదేవ ఆలయ తాళాన్ని తెరిచారు. ఆసక్తికర విషయం ఏంటంటే.. స్థానిక ముస్లింలు కూడా పరిపాలన అధికారులకు సహకరించి ఎలాంటి శాంతిభద్రతల సమస్యలూ తలెత్తకుండా చూశారు. ఆలయం లోపల రెండు-మూడు విరిగిన శివలింగాలు మినహా సిద్దీశ్వర్ మహాదేవుని శివలింగం మాత్రం లేదు.
ఈ ప్రదేశానికి ఉన్న ప్రాముఖ్యత నేపథ్యంలో శివలింగం కనిపించకున్నా కూడా సనాతన సంప్రదాయం ప్రకారం కొత్త శివలింగాన్ని ప్రతిష్టించవచ్చు. ఆలయాన్ని తెరిచినప్పుడు శిథిలాలను తొలగించి గర్భగుడిని గంగాజలంతో శుద్ధి చేసి తిరిగి ఆలయానికి తాళం వేశారు. ఆలయాన్ని తెరుస్తున్న విషయం తెలియడంతో‘ధుంధే కాశీ’ ప్రజలు అక్కడికి చేరుకుని ‘హర్ హర్ మహాదేవ్’ అంటూ శివనామస్మరణ చేశారు. ఖర్మల అనంతరం ఈ ఆలయాన్ని పునరుద్ధరించనున్నారు. ఆలయ పునరుద్ధరణ అనంతరం ఆలయం తెరవడానికి సంబంధించి శ్రీ కాశీ విద్వత్ పరిషత్ రెండు మూడు రోజుల్లో ముఖ్యమైన సమావేశాన్ని ఏర్పాటు చేయనుంది.