తిరుపతి శ్రీ తాతయ్యగుంట గంగమ్మకు తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారు సారె పంపించారు.శనివారం సాయంత్రం శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈవో శ్రీ లోకనాథం శ్రీ గోవిందరాజస్వామి ఆలయం నుంచి ఊరేగింపుగా శ్రీ గంగమ్మ గుడికి వెళ్ళి సారె అందజేశారు. తిరుపతి శ్రీ తాతయ్యగుంట గంగమ్మ తల్లి తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి సోదరిగా చెబుతారు. జాతర సందర్భంగా శ్రీవారి ఆలయం నుంచి గంగమ్మ తల్లికి సారె సమర్పించడం చాలా కాలంగా సంప్రదాయంగా వస్తోంది. ఈ కార్యక్రమంలో శ్రీ గోవిందరాజస్వామి ఆలయ డిప్యూటీ ఈవో శ్రీమతి శాంతి, గంగమ్మ ఆలయ ఈవో శ్రీమతి మమత, పారుపత్తేదార్ శ్రీ ఉమామహేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
శ్రీ తిరుపతి తాతయ్యగుంట గంగమ్మకు జాతర పెద్ద ఎత్తున జరుగుతుంది. ఈ జాతరకు కేవలం తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా కర్ణాటక, తమిళనాడు నుంచి భక్తులు తరలివస్తారు. ఎనిమిది రోజులపాటు జరిగే ఈ జాతరలో ఒక్కో రోజు ఒక్కో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. గంగమ్మ తల్లిని స్వయంగా శ్రీ వేంకటేశ్వర స్వామి వారి సోదరి అని అంటారు కాబట్టి ఈ జాతర సమయంలో టీటీడీ నుంచి గంగమ్మకు సారె అందుతుంది. పసుపు-కుంకుమ, శేష వస్త్రాలూ గంప, చేట తదితర మంగళద్రవ్యాలను మేళ, తాళాలతో తీసుకొచ్చి గంగమ్మకు పుట్టింటి సారెగా అందజేస్తారు. తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి స్వామివారి తరుఫున అర్చకులు, ఆలయ అధికారులు ఈ సారెను గంగమ్మకు ఇస్తారు.