భారీ వర్షాల కారణంగా దెబ్బతిన్న శ్రీ కుసుమ హరినాథ్ బాబా మందిరం

ప్రస్తుతం భారీ వర్షాలు భద్రాచలంను కుదిపేస్తున్నాయి. ఇరిగేషన్ అధికారుల నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో భద్రాద్రి శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానం పరిసర ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. మరోవైపు ఆలయానికి అనుబంధంగా ఉన్న శ్రీ కుసుమ హరినాథ్ బాబా మందిరంలో ఈశాన్య మండపానికి బీటలు వారాయి. ఈ క్రమంలోనే ఈశాన్య మండపం ఏ క్షణమైన కూలే అవకాశాలు కనిపిస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా కుసుమ హరినాథ్ బాబా ఈశాన్యం మండపం అడుగు భాగం పూర్తిగా దెబ్బతిన్నది. ఈ క్రమంలోనే కూలేందుకు సిద్ధంగా ఉంది.

శ్రీ కుసుమ హరినాథ్ బాబా మందిరం కింద భాగం పెచ్చులు ఊడి కింద పడింది. అక్కడ ఆ సమయంలో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తృటిలో తప్పింది. సంఘటన స్థలాన్ని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ పరిశీలించారు. మండపాన్ని పూర్తిగా తీసివేసి పరిస్థితి చక్కదిద్దాలని అధికారులకు జితేష్ వి పాటిల్ సూచించారు. ఎటువంటి ప్రమాదం జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. మరోవైపు భారీ వర్షానికి నీట మునిగిన రామాలయ పరిసర ప్రాంతాలను సైతం కలెక్టర్ పరిశీలించారు. స్వామివారి అన్నదాన సత్రం వద్ద నీరు నిలిచిన ప్రాంతాన్ని సైతం కలెక్టర్ సందర్శించారు.

Share this post with your friends