షాకింగ్‌గా శ్రీవారి ఆదాయం.. 2022లో మాదిరిగానే..

తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి హుండీ ఆదాయం రికార్డ్ స్థాయిలో వచ్చింది. నిన్న ఒక్కరోజే ఏకంగా రూ.5.41 కోట్లు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. వాస్తవానికి కరోనా తరువాత ఇంత పెద్ద మొత్తంగా హుండీ ఆదాయం రావడం ఇది రెండవ సారి. సరిగ్గా 2022 ఫిబ్రవరిలో సైతం ఇదే విధంగా రూ.5.41 కోట్ల హుండీ ఆదాయం వచ్చింది. ఆసక్తికర విషయమేంటంటే ఈ రెండు దినాలు సాధారణమైనవే కావడం. పైగా ఈ రెండు రోజుల్లోనూ మార్పు లేకుండా ఒకే మొత్తంలో హుండీ ఆదాయం రావడం. ఈ రెండు రోజుల్లోనూ ఎలాంటి ప్రత్యేకమైన శుభదినం లేదు.

నిన్న శ్రీవారిని 75,125 మంది భక్తులు దర్శించుకోగా.. 31,140 మంది తలనీలాలు సమర్పించారు. ఇక పాఠశాలలు తిరిగి ప్రారంభమైన కూడా తిరుమలలో భక్తుల రద్దీ ఏమాత్రం తగ్గడం లేదు. టోకెన్ లేని భక్తుల శ్రీవారి సర్వదర్శనానికి 20 గంటల సమయం పడుతోందని తిరుమల తిరుపతి దేవస్థానం చెబుతోంది. ఇవాళ అన్ని కంపార్ట్‌మెంట్లు భక్తులతో నిండిపోయాయి క్యూలైన్లు వెలుపలికి వచ్చాయి. భక్తుల క్యూలైన్‌ కృష్ణ తేజ గెస్ట్‌హౌస్‌ వరకూ ఉండటం గమనార్హం. గతంలో ఎన్నడూ జూన్ రెండో మూడో వారంలో ఇలాంటి పరిస్థితి లేదని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు చెబుతున్నారు. భక్తుల సంఖ్య భారీగా పెరిగిపోవడంతో వసతి గృహాలు దొరకడం కూడా కష్టంగానే మారింది.

Share this post with your friends