ఆమె కోసం శివుడు కొండను చీల్చి ప్రదక్షిణ మార్గం ఏర్పాటు చేశాడట..

ఇప్పుడంటే సమయం లేకనో ఏమో కానీ భగవత్ చింతన తగ్గిపోయింది కానీ పూర్వ కాలంలో ఇలా ఉండేది కాదు. తపస్సులో కూర్చొంటే ఇక అంతే.. అంతటి తపస్సుకు దేవుడు సైతం కరిగిపోయి ఏదో ఒక వరమిచ్చేవాడు. అలా భక్తుల కోసం కొన్ని ప్రాంతాల్లో స్వయంగా భగవంతుడు వెలిశాడు కూడా. అలా వెలిసిన ప్రాంతాల్లో వరంగల్ జిల్లాలోని పాలకుర్తి ఒకటి. ఇక్కడ వెలిసిన దైవమే సోమేశ్వరుడు. ఈ ఆలయ కథేంటంటే.. దాదాపు 1300 ఏళ్ల క్రితం ఋషులు తపస్సుకు మెచ్చి సోమేశ్వరుడు స్వయంభువుగా పాలకుర్తిలో వెలిశాడని చెబుతారు. అయితే సోమేశ్వరుడు ఇక్కడ ఎందుకు వెలిశాడో చెప్పేందుకు మరో కథ కూడా ఉంది.

పూర్వం ఓ వృద్ధురాలు శివుడిపై భక్తితో ఓ ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసేదట. అయితే ఆలయం కొండైన ఉండటంతో ప్రదక్షిణకు వీలు కాక కొండ చుట్టూ తిరిగి వెళ్లిపోయేదట. ఆ తరువాత కొంత కాలానికి ఆమెకు వయసు మీద పడటంతో కొండ చుట్టూ తిరగ లేక నానా యాతన పడేదట. అప్పుడు పరమేశ్వరుడు ఆ వృద్ధురాలి భక్తికి మెచ్చి తన ఆలయం వెనుక ఉన్న కొండను చీల్చి.. ప్రదక్షిణ మార్గాన్ని ఏర్పాటు చేశాడు. అప్పటి నుంచి భక్తులంతా మార్గంలోనే ప్రదక్షిణ చేస్తారట. భక్తిగా ఆ మార్గంలో వెళ్తే ఎంత లావుగా ఉన్నా కూడా సునాయాసంగా వెళ్తారట. మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. ఇక్కడకు అపరిశుభ్రంగా వెళితే తేనెటీగలు తరిమి తరిమి కుడతాయట.

Share this post with your friends