ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రీ వేంకటేశ్వర స్వామివారి భక్తుల శ్రేయస్సుతో పాటు లడ్డూ ప్రసాదాల పవిత్రత, దైవత్వాన్ని పునరుద్ధరింపజేసేందుకు తిరుమల శ్రీవారి ఆలయంలో ఇవాళ శాంతి హోమం నిర్వహించనున్నట్లు టీటీడీ ఈవో శ్రీ జె.శ్యామలరావు చెప్పారు. తిరుపతిలోని శ్రీ పద్మావతి విశ్రాంతి భవనంలో టీటీడీ ఈవో, అదనపు శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరితో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ.. ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మంది శ్రీవారి భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా శ్రీవారి నైవేద్యంలో వాడే నెయ్యిలో కల్తీ ఉందని గుర్తించామన్నారు. సర్వపాప పరిహారార్థం, భక్తుల శ్రేయస్సును ఆకాంక్షిస్తూ సోమవారం ఉదయం 6 నుంచి 10 గంటల వరకు తిరుమలలోని బంగారు భావిష్యంత ఉన్న యాగశాలలో శాంతి హోమం నిర్వహించాలని టీటీడీ నిర్ణయించినట్లు తెలిపారు.
ఇదివరకే ఆగస్టు 15 నుంచి 17వ తేదీ వరకూ టీటీడీ మూడు రోజుల పాటు పవిత్రోత్సవాలను ఆకమోక్తంగా నిర్వహించిందని, అయితే శ్రీవారి నైవేద్యంలో కల్తీ పదార్థాలు ఉన్నది గుర్తించినందున, అందుకు పరిహరణగా శాంతి హోమం నిర్వహించాలని ఆగమ సలహా మండలి నిర్ణయించినట్లు చెప్పారు. లడ్డూల రుచిని మెరుగుపరిచేందుకు టీటీడీ చేపట్టిన చర్యలను వివరిస్తూ, టీటీడీ ప్రస్తుతం ఆవు నెయ్యి కొనుగోలు విధానాన్ని పూర్తిగా మార్చివేసిందని, స్వచ్ఛమైన ఆవునేయిని ఎంతో పారదర్శకంగా కొనుగోలు చేస్తున్నామని తెలిపారు. ఈ సంస్కరణలతో ఇప్పుడు లడ్డూ ప్రసాదం రుచి అనేక రెట్లు మెరుగుపడిందని, భక్తులు కూడా ఎనలేని సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారని ఈవో వివరించారు. ఈ సమావేశంలో జేఈవో శ్రీ వీరబ్రహ్మం, ఆగమ సలహాదారులు శ్రీ మోహన రంగాచార్యులు, శ్రీరామకృష్ణ దీక్షితులు తదితరులు పాల్గొన్నారు.